భారత ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏఎస్పీ నాగేశ్వరరావు సూచించారు. తాళ్లూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన తూర్పుగంగవరం, శివరామపురాల్లో ఆయన సోమవారం పర్యటించారు. గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఆందోళన చెందకుండా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకో వచ్చన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది కలిగించే విధంగా గొడవలు, ఘర్షణలకు పాల్పడితే అలాంటి వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దర్శి నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీఎస్పీ అశోకవర్ధన్ రెడ్డి , సీఐ షేక్ షమీముల్లా, ఎస్ఐ వైవీ రమణయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.


