కంటోన్మెంట్ లో ఎగిరేది గులాబీజెండానే!! – కంటోన్మెంట్ లో నివేదితకు భారీ మెజార్టీ ఖాయమన్న తలసాని – నివేదితకు ప్రజలంతా మద్దతు పలకాలి – కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదు – మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలోనూ ఎగిరేది గులాబీజెండానేనన్న తలసాని – సమీక్షా సమావేశంలో నేతలకు కీలక సూచనలు చేసిన తలసానికంటోన్మెంట్ లో ఎగిరేది గులాబీజెండానే!! – కంటోన్మెంట్ లో నివేదితకు భారీ మెజార్టీ ఖాయమన్న తలసాని

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నివేదితకు 25 వేల నుంచి 35 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ తో దివంగత ఎమ్మెల్యే సాయన్న 35 ఏళ్లు అనుబంధం ఉందన్నారు. కంటోన్మెంట్ ప్రజలంతా సాయన్న కుటుంబసభ్యులేనన్నారు. సాయన్న బిడ్డగా నివేదితకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని.. ప్రచారంలో అద్భుత స్పందన వస్తోందని తలసాని తెలిపారు. రాజకీయాలు నివేదితకు కొత్తకాదని, సాయన్న చివరిరోజుల్లో నివేదిత ఆయన వెంటే ఉన్నారని గుర్తుచేశారు. ఏడాదికాలంలో తండ్రిని, చెల్లిని కోల్పోయిన నివేదితకు ప్రజలంతా దీవెనలు అందించాలని తలసాని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కేసీఆర్, కేటీఆర్ సహకారంతో కంటోన్మెంట్ లో సాయన్న ఎన్నో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేశారని తలసాని తెలిపారు. డిఫెన్స్ ప్రాంతం అయినప్పటికీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చొరవ చూపారని గుర్తుచేశారు. అందుకే కంటోన్మెంట్ ప్రజల గుండెల్లో సాయన్నకు సుస్థిరస్థానం ఉందన్నారు. సాయన్న బిడ్డ అయిన నివేదితను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తలసాని వెల్లడించారు. నివేదిత గెలుపు కోసం ఇంఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు.

కంటోన్మెంట్ లో ఇతర పార్టీలకు స్థానం లేదని తలసాని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు క్యాడరే లేదని చురకలంటించారు. ఆరు గ్యారెంటీలు.. కాంగ్రెస్ కే బూమరాంగ్ అవుతాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కంటోన్మెంట్ కు మాత్రం పైసా లాభం జరగలేదని మండిపడ్డారు. ఇక రోజుకో పార్టీ, పూటకో కండువా మార్చే నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తలసాని స్పష్టం చేశారు.

అటు మల్కాజ్ గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి విజయం సాధిస్తారని తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీల ఎంపీ అభ్యర్థులిద్దరూ నాన్ లోకల్ వారేనని… లోకల్ అయిన రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు.

మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర మొదలవ్వగానే ఇతర పార్టీలకు భయం పట్టుకుందన్నారు తలసాని. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం సరికాదన్నారు. క్రిశాంత్ అరెస్టును తలసాని తీవ్రంగా ఖండించారు. ఫేక్ కంప్లయింట్ లతో అరెస్టులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో చూడాల్సిన అవసరముందని తలసాని వెల్లడించారు.

అంతకుముందు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కంటోన్మెంట్ లో ప్రచారసరళి గురించి నేతలను తలసాని అడిగి తెలుసుకున్నారు. కీలకమైన సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నతో పాటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ టీఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆకుల హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *