కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే బీ జే పి ని గెలిపించడమే నని సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి పద్మారావు గౌడ్, మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. గురువారం సాయంత్రం సనత్ నగర్ అల్లా ఉద్దిన్ కోటిలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బస్తీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దొంగ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసం అనేక తప్పుడు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను నమ్మి మరోసారి మోసపోవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అల్లా ఉద్దిన్ కోటి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పట్టాల పంపిణీ, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా వ్యవస్థల ను అభివృద్ధి చేసిన విషయాన్ని తెలిపారు. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న హై టెన్షన్ విద్యుత్ లైన్ ను కూడా తమ ప్రభుత్వ హయాంలోనే తొలగించి బస్తీ వాసుల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా కే సి ఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, తమ తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకాలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరుకు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఉన్న తేడా ను ప్రజలు గుర్తించారని అన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్ పి గా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కనీసం ప్రజల వద్దకు వచ్చిన పాపాన పోలేదన్నారు. నిత్యం ప్రజల మద్య ఉంటూ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి పద్మారావు గౌడ్ ను కారు గుర్తుపైన ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తలసాని ఓటర్లను కోరారు. అనంతరం బస్తీవాసులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి మేడే రాజీవ్ సాగర్, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ BRS అద్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, బస్తీ అద్యక్షులు కరీం లాలా, సభ్యులు జాఫర్, అస్రఫ్, రఫిక్, పాజిల్, రిజ్వానా, వసీం, నాయకులు ఖలీల్, జమీర్, సురేష్ గౌడ్, రాజేష్, ఆకుల రాజు, భూపాల్ రెడ్డి, పి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.





