ముస్లీంల అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వంలోనే జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ లోని జాఫ్రీ మసీద్ వద్ద ముస్లీం ల ప్రార్ధనల అనంతరం బయట వారిని కలిసి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్ధులలో ది బెస్ట్ లీడర్ పద్మారావు గౌడ్ అని నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించారని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కే సి ఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో అనేక మైనార్టీ రెసిడెన్షియ ల్ స్కూల్ ను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించిందని తెలిపారు. అదేవిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష 116 రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రంజాన్ సందర్బంగా తమ ప్రభుత్వ హయాంలో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయడంతో పాటు పేద ముస్లీం లకు తోఫా క్రింద నూతన వస్త్రాల కిట్ లను అందజేసినట్లు వివరించారు. ఇవే కాకుండా రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై వంటి అనేక అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి తగినబుద్ది చెప్పాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుత సికింద్రాబాద్ ఎమ్ పి కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి నియోజకవర్గ పరిధిలో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కనీసం బస్తీలు, కాలనీలో పర్యటించలేదని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని, అభివృద్దిని పట్టించుకోని కిషన్ రెడ్డికి మరోసారి ఎందుకు ఓటు వేయాలి అని ఆయన ప్రశ్నించారు. నిత్యం ప్రజల మద్య ఉంటూ, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పద్మారావు గౌడ్ ను గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ముస్లీం నాయకులు కరీం లాలా, ఖలీల్, పాజిల్, జమీర్, ఇబ్రహీం, ఇమ్రోజ్, సమి ఉల్లా, అమీర్ పేట డివిజన్ బీ ఆర్ ఎస్ అద్యక్షుడు హన్మంతరావు, నాయకులు సురేష్ గౌడ్, అశోక్ యాదవ్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.




