అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి… మాజీ మంత్రి.సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లోని చుట్టాల బస్తీ, నల్లగుట్ట, వార్డ్ ఆఫీస్, J లైన్, F లైన్, C లైన్ తదితర ప్రాంతాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాలలో స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. J లైన్ లో కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానిక మహిళలు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకు రాగా, సమస్య పరిష్కారం కోసం నూతన సీవరేజ్, వాటర్ పైప్ లైన్ పనులను మంజూరు చేసినట్లు చెప్పారు. 2,3 రోజులలో పనులను ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. పలు రోడ్లలో సీవరేజ్ నుండి ఓవర్ ఫ్లో అయి మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తుందని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలపగా, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. C లైన్ లో నూతనంగా సీవరేజ్ లైన్ ఏర్పాటు చేశారని, కానీ మ్యాన్ హోల్స్ నిర్మాణాన్ని అసంపూర్తిగా చేశారని మంత్రికి స్థానికులు విన్నవించగా, వెంటనే నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని DC శంకరయ్యను ఆయన ఆదేశించారు. అదేవిధంగా నూతనంగా మంజూరైన పనులను కూడా వెంటనే చేపట్టే విధంగా అవసరమైన చర్యలను తీసుకోవాలని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లబ్దిదారుల ఎంపిక పై అయోమయం…తలసాని

ప్రజాపాలన కార్యక్రమం క్రింద 6 పథకాల కోసం ధరఖాస్తు చేసుకొనే వారిలో అర్హులను ఎప్పటి లోగా ఎంపిక చేస్తారనే విషయంలో సరైన స్పష్టత లేకపోవడం వలన ప్రజలు అయోమయానికి గురికావాల్సి వస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన రాంగోపాల్ డివిజన్ పర్యటనలో భాగంగా చుట్టాల బస్తీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ధరఖాస్తు లకు సంబంధించి కేంద్రంలోని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ లోగా అర్హులైన ప్రజలను ధరఖాస్తు చేసుకోమని చెప్పిందే తప్ప, ఎప్పటిలోగా అర్హులను ఎంపిక చేస్తామనే విషయాన్ని ప్రకటించలేదని అన్నారు. కేంద్రంలోని అధికారులను కూడా ఇదే విషయాన్ని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించగా, తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా లబ్దిదారులను ఎప్పటి లోగా ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేసి ప్రజలలో ఉన్న అయోమయాన్ని తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో DC శంకరయ్య, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, వాటర్ వర్క్స్ DGM శశాంక్, సురేష్, BRS పార్టీ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు, అరుణ్ భట్, సతీష్, గణేష్, నిర్మల, సత్యనారాయణ, R.సత్యనారాయణ, రాజేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *