నిరాధారణకు గురైన బాల బాలికల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకొని వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు.
గురువారం ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో బాలల హక్కులపై ” బంగారు బాల్యం ” పేరుతో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ప్రత్యేక వర్క్ షాప్ లో నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్.పి ఎ.ఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల బంగారు భవిష్యత్ వైపు ప్రకాశం జిల్లా 100 శాతం సాధన దిశగా .. అనే కాన్సెప్ట్ తో రూపొందించిన పోస్టర్ ను ప్రారంభించారు.
నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్ధి మాట్లాడుతూ, నిరాధారణకు గురైన బాల బాలికల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకొని వారికి అండగా ఉండాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు. ప్రతి బిడ్డ సురక్షితంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యంగా మరియు విద్యావంతులుగా ఉండేలా మరియు బాలల రక్షణ మరియు పిల్లల హక్కులకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల హక్కులు కాపాడటం, సమాజంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం అనే వినుత్నమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు. బంగారు బాల్యం కార్యక్రమం లక్ష్యాన్ని సాధించేలా ప్రతి ఒక్కరు నిబద్దతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు కలలు కంటేనే ఏమైనా చేయగలమన్నారు. ఆకలి అన్నింటిని తెలుసుకునేలా చేస్తుంది. అదే అవసరం కొత్త దారులను వెతికేలా మార్గాలు చూపిస్తుందని చెప్పారు. జీవితంలో ఎదగాలంటే చదువు అత్యంత అవసరమని స్పష్టం చేశారు. నేడు సమాజంలో బాలల హక్కుల పరిరక్షణ అమలు ఎంతో అవసరమన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పిల్లల ఆరోగ్యం, విద్య, పరిరక్షణ సూచించబడ్డాయని, ఆ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా నేను 25 సంవత్సరాల కాలంలో సుమారు 150 దేశాలలో పర్యటించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్ధి బాలల హక్కుల పరిరక్షణలో తన అనుభవాలను, విశేషాలను వివరించారు.
మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వచ్చే సంఘటనలను దృష్ట్యా జిల్లా కలెక్టర్ జిల్లాలో వినూత్నమంగా బంగారు బాల్యం అనే కార్యక్రమానికి రూపకల్పనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. బాల్యం గురించి, బాలల హక్కుల గురించి, బాల్యం విలువైందని తెలియచేస్తూ, చైతన్య పరస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలని సమిళితం చేసి ఆ ఫలాలు నిరాదరణకు గురైన బాల బాలికలకు అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. బాలల హక్కుల కోసం, బాల కార్మికుల విముక్తి కోసం, బాలల సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేస్తున్న నోబుల్ గ్రహీత కైలాష్ సత్యర్ధి ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించచడం జిల్లా కలెక్టర్ ను ఈ సంధర్భంగా మంత్రి అభినందించారు. బాలల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషిని మనతో పంచుకోవడానికి జిల్లాకు వచ్చిన నోబుల్ గ్రహీత కైలాష్ సత్యర్ధి కి మంత్రి ప్రత్యేక కృతజ్ఞలు తెలియచేశారు. బాల బాలికల హక్కులను కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నదన్నారు. ఈ రోజు సమాజంలో చిన్న పిల్లలపై జరుగుచున్న అత్యాచార సంఘటనలు మనం చూస్తా వున్నాం. సమాజంలో వున్న ఆర్ధిక పరిస్థితులు కావచ్చు తల్లిదండ్రుల పేదరికం, విద్య లేకపోవడం, పిల్లలు నిరాదరణకు గురైన సమయంలో బాల్య వివాహాలు జరుగుచున్నవవి, ఈ పరిస్థితుల్లో బాలికలను విద్యావంతులను చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు నడుపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎవరైనా ప్రత్యేక పరిస్థితుల్లో వున్న పిల్లలను గుర్తించి వారికి విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్మీడియట్ తరువాత చాలా మంది ఆడపిల్లలకు వివాహాలు చేస్తున్నారన్నారు., సాంఘిక సంక్షేమ శాఖ ఆద్వర్యంలో సింగరాయకొండలో డిగ్రీ కళాశాలను కూడా ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. పెళ్లి అనే ఆప్షన్ కాకుండా విద్య అనే ఆప్షన్ తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు. అనురాగం అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చి తల్లిదండ్రులు లేని వారికి కూడా వసతిగృహాల్లో భోజన వసతి కల్పిస్తునట్లు మంత్రి వివరించారు. సమాజంలో నిరాధారకు గురైన పిల్లలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే భరసాతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వారిలో విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మన జిల్లాలోనే బంగారు బాల్యం అనే పేరుతో వినూత్నంగా ప్రారంభించిన బంగారు బాల్యం కార్యక్రమాన్ని గ్రామ స్థాయి కమిటీలన్నీ నిబద్దత, అంకిత భావంతో పని చేసి ప్రకాశం జిల్లాను బంగారు బాల్యం, బంగారు ప్రకాశం అనే విధంగా ముందుకు తీసుకుపోయేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముందుగా మంత్రి అందరికి మాతృ బాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ నిరాధరణకు గురైన బాల బాలికలకు మంచి భవిష్యత్ కల్పించాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో జిల్లాలో ఈ రోజు ‘బంగారు బాల్యం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. బాలల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరికి స్పూర్తిని ఇస్తున్న శ్రీ కైలాష్ సత్యార్థి ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో పిల్లలందరినీ (0-18) సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా, సాధికారతతో తీర్చిదిద్దడమే బంగారు బాల్యం కార్యక్రమం లక్ష్యమన్నారు. పిల్లలను కేంద్ర బిందువుగా కలిగి ఉన్న వాటాదారులందరినీ కలుపుకొని సమగ్ర పద్ధతిలో పిల్లలందరి సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడం జరుగుతుందన్నారు. పిల్లల నిర్దిష్ట సూచికల ఎంపిక మరియు లక్ష్యాన్ని నిర్దేశించడం, సర్వైవల్, హెల్త్ మరియు న్యూట్రిషన్, విద్య మరియు అభివృద్ధి, రక్షణ మరియు భద్రత, 100% జనన నమోదు, బాల్య పోషకాహార లోపాన్ని 100% తగ్గించడం, మహిళలు, కౌమారదశలో ఉన్న బాలికలు మరియు పిల్లలలో రక్తహీనత 100% నివారణ ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామం, బ్లాక్ స్థాయి మరియు నియోజకవర్గ స్థాయిలో 100% ఫంక్షనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసి పూర్తీ స్థాయిలో జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ప్రతి బిడ్డ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు సంపూర్ణమైన బాల్యం కోసం హక్కును నిర్ధారించడానికి రూపొందించిన బంగారు బాల్యం కార్యక్రమ ప్రారంభానికి ప్రఖ్యాత భారతీయ బాలల హక్కుల కార్యకర్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి రావడం వారి ఆలోచనలు, వారి అనుభవాలు మనతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, మనందరికీ స్పూర్తి దాయకమన్నారు.
జిల్లా ఎస్.పి ఎ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లల్లు స్కూల్ కు వెళ్ళేలా చేయడం వారికి తగిన గుర్తింపు ఇవ్వడం, వారి హక్కులను పరిరక్షించడం అందరి భాద్యతన్నారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్ములించేలా చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా పోలీసు శాఖల తమ వంతు కృషి చేస్తుందన్నారు.
బాల కార్మికుల నిర్మూలనలో భాగంగా ఈ నెల 1 నుండి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో గుర్తించి స్కూల్ లో చేర్పించబడిన బాల కార్మికులను ఈ సందర్భంగా నోబుల్ గ్రహీత కైలాష్ సత్యర్ధి, మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల కృష్ణ, శిశు సంక్షేమ శాఖ పిడి శ్రీమతి మాధురి, చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం ఉప సంచాలకులు శ్రీ రవి కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, వివిధ పాఠశాలల విద్యార్ధులు, ఐసిడిఎస్., వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
