ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా పరిష్కరిస్తూ వస్తున్నానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట జే లైన్ లో 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన లైబ్రరీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు సకాలంలో, నాణ్యతగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు పాత భవనం తొలగించి జీ ప్లస్ పద్దతిలో నూతన భవనాన్ని మంజూరు చేయించినట్లు తెలిపారు. కాగా బస్తీ వాసులు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరగా అదనంగా మరో ప్లోర్ మంజూరు చేయడం జరిగిందని వివరించారు. భవనం వెనుక ఉన్న గ్రంధాలయానికి చెందిన ఖాళీ స్థలాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు పనులు చేపడతామని, గడిచిన 10 సంవత్సరాల లో జరిగిన అభివృద్ధి పనులు అందుకు నిదర్శనమని చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న భవనం లో లైబ్రరీ, కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా బస్తీలోని రోడ్డు అద్వాన్నంగా మారిందని తెలపగా, నూతన రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానికంగా ఉన్న పార్క్ సుభాష్ మైదాన్ లో పర్యటించారు. పాత్ వే నిర్మాణం, వివిధ రకాల మొక్కలు, ల్యాండ్ స్కెపింగ్ చేపట్టి బస్తీవాసులకు అందుబాటులో కి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే జోన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ,టి ఎస్ ఈ డబ్లూ ఐ డి సి ఈ ఈ షఫీ, వాటర్ వర్క్స్ జీ ఎం వినోద్, జీ హెచ్ ఎం సి ఏ ఈ శివకుమార్, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



