తాళ్ళూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథకం క్రింద ఏర్పాటు చేసిన రూ.5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ మూన్నాళ్ళ ముచ్చటగానే మారింది. ప్రస్తుతం పని చేయటం లేదు. 2020లో నాడు-నేడు పథకం క్రింద గత ప్రభుత్వం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ ఐదేళ్లలో ఒక్కరోజు కూడా పని చేయలేదు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, స్థానిక నాయకుల చొరవతో జనవరి నెలలో రిపేరు చేసిన వాటర్ ప్లాంట్ పట్టుమని 10రోజులు కూడా పని చేయకుండానే తిరిగి మొరాయించింది. సదరు వాటర్ ప్లాంట్ ఎన్నిసార్లు రిపేరు చేసినప్పటికీ ఉపయోగములోకి వచ్చి విద్యార్థుల దాహార్తిని తీర్చడం లేదు. కావున పని చేయని వాటర్ ప్లాంట్ ను తిరిగి కంపెనీకి అప్పజెప్పి పాఠశాలలో వాటర్ , విద్యార్థుల త్రాగునీటి అవసరాలను తీర్చే కొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎస్.ఎం.సి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
