పేదరికాన్ని ఎదిరించి ఉన్నత విద్యావంతునిగా ఎదిగిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ ఉన్నత స్థితిలో నిలవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామాత్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేలా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో ఆదివారం తూర్పునాయుడుపాలెంలోని తన స్వగృహం నుంచి మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్.లక్ష్మానాయక్ మాట్లాడుతూ ….. ఆయా హాస్టళ్లలోని విద్యార్థుల వివరాలను, పరీక్షలకు వారిని సన్నద్ధం చేస్తున్న తీరును వివరించారు. జిల్లాలోని 61 ప్రీమెట్రిక్, 20 పోస్టు మెట్రిక్ హాస్టళ్ళలో 7274 మంది విద్యార్థులు ఉంటున్నట్లు తెలిపారు. వీరిలో 911 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని, 505 మంది ఇంటర్ మొదటి సంవత్సరం, 411 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులతో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఈ విధంగా ముఖాముఖి నిర్వహించడంపై మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ……. విద్యతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని అన్నారు. అందుకే విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హాస్టళ్ళ మరమ్మ తులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లను మంజూరు చేసిందని, ప్రకాశం జిల్లాకు 13 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామన్నారు.
వీటితోపాటు ఒంగోలులోని సంతపేటలో రూ.6.50 కోట్లతో బాలికల హాస్టల్ , సంతనూతలపాడులో రూ.2 కోట్లతో బాలుర హాస్టల్, చీమకుర్తిలో రూ.2 కోట్లతో బాలికల హాస్టల్, ఒంగోలులోని సక్కుబాయమ్మ ప్రభుత్వ కాలేజీలో రూ.5.50 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సక్కుబాయమ్మ కాలేజీ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అప్పటివరకు పరివర్తన భవనములో వారికి ఆశ్రయం కల్పించడానికి 60 లక్షల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించి ఉత్తమ విద్య, నాణ్యమైన భోజనము పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని ఉత్తమ మార్కులతో అందరూ ఉత్తీర్ణులు కావాలని మంత్రి సూచించారు. అందుకే విద్యార్థులలో ధైర్యం నింపేలా నేరుగా తానే మాట్లాడుతున్నట్లు చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ప్రతిభ చాటాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆశయం అని మంత్రి తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు అవసరమైన ఆల్ – ఇన్ – వన్ గైడ్లు ఇచ్చామని, పదవ తరగతితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అవసరమైన చోట ట్యూటర్లను కూడా పెట్టామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బి.పి.టి. బియ్యంతో భోజనం పెడతామని, అన్ని హాస్టళ్లలో మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్స్ పెడతామని, సకాలంలో ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, టవల్స్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఉంటున్న పేద విద్యార్థులకు ప్రభుత్వమే గార్డియన్ అని మంత్రి చెప్పారు. వారి రక్షణకు, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థుల మిస్సింగ్ కేసులను త్వరగా ఛేదించామన్నారు.
వెల్ఫేర్ ఆఫీసర్లు , వార్డెన్లు కూడా ప్రతి ఒక్క విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి ఆదేశించారు. లోగ్రేడులో ఉన్న విద్యార్థులు కూడా మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చూడాలని, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఉన్నందున ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమయ్యేలా చేయాలని సూచించారు. స్టడీ అవర్స్ పై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతిభగల విద్యార్థులతో గురుకుల కాలేజీలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేయించాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. సింగరాయకొండ గురుకుల కాలేజీలో డిగ్రీ కోర్సులు కూడా ప్రవేశపెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కేవలం చదువే కాకుండా విద్యార్థులకు అవసరమైన వినోదం కోసం రిక్రియేషన్ సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని వివిధ హాస్టళ్లలో జరుగుతున్న మరమ్మతు పనులను కూడా ఈ ఆన్లైన్ లోనే మంత్రి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఏ.పీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సీ. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ బాబుకు ఈ పనులకు సంబంధించి మంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ జూమ్ మీటింగులో జిల్లాలోని అందరు ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ.లు తమ పరిధిలోని హాస్టళ్ళ నుంచి పాల్గొన్నారు.

