బేగంపేట మార్చి 18(జె ఎస్ డి ఎం న్యూస్) : ఫుట్ పాత్ వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ పట్ల అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాంగోపాల్ పేట డివిజన్ లోని మినిస్టర్ రోడ్, పి.జి. రోడ్, సింధీ కాలనీలకు చెందిన పలువురు ఫుట్ పాత్ వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జీ హెచ్ ఎం సి అధికారులు తమ వ్యాపారాలకు అనుమతిస్తున్న కూడా ట్రాఫిక్ సమస్యల పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు జీవనాధారం లేకుండా చేస్తే మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు. అంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి వివిధ రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వ్యాపారులకు అవసరమైన సూచనలు, జాగ్రత్తలు చెప్పాలి కానీ వ్యాపారాలే చేయకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, రాంగోపాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నాగులు, టౌన్ వెండింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
