వచ్చే మే నెలలో ఒంగోలులో జరుగు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యుణే 36వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) కార్యదర్శి డి సోమసుందర్ జర్నలిస్టు లోకానికి పిలుపునిచ్చారు. మే నెలలో జరగబోవు యూనియన్ రాష్ట్ర మహాసభలకు సంబంధించి సన్నాహక సమావేశం జిల్లా యూనియన్ కమిటీ అధ్యక్షులు ఎన్వి రమణ అధ్యక్షతన మంగళవారం స్థానిక మల్లయ్య లింగం భవన్లో యూనియన్ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యుకే దేశంలో ఐజేయూ రాజీలేని పోరాటాలను కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రశంసలు పొందుతుందని అన్నారు. మహాసభలకు రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు విజయవాడ అర్బన్, అమరావతి శాఖల నుండి, రాష్ట్ర కౌన్సిల్ ఐజేయూ సభ్యులు మరియు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన యూనియన్ బాధ్యులు మొత్తం దాదాపు 300 మంది ప్రతినిథులు హాజరు కానున్నారని అన్నారు. గత ఏడు దశాబ్దాల కాలంలో యూనియన్ రోజురోజుకు మరింత బలోపేతం అవుతూ జర్నలిస్టుల ఆదరణను పొందుతుందని అన్నారు. ఏపీ యూనియన్ శాఖలో 10 వేల మందికి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై ఒకవైపు పోరాటాలు మరోవైపు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని డి సోమసుందర్ అన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒంగోలులో 1987లో, 2002వ సంవత్సరంలో రెండుసార్లు జరిగాయని తిరిగి వచ్చే మే నెలలో జరగనున్నాయని అన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు జిల్లా కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో యూనియన్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటిని అధిగమించి నేడు మరింత బలోపేతంతో ముందుకెళ్తుందని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు నివాస స్థలాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటగా 1996వ సంవత్సరంలో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయించిన ఘనత తమ యూనియనికే దక్కిందని ఆయన అన్నారు. త్వరలో జరగబోవు యూనియన్ మహాసభలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలతో మరింత ముందుకెళ్లేందుకు నూతన ఆలోచనలతో సమిష్టి నిర్ణయాలతో కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని ఐవీ సుబ్బారావు అన్నారు.
ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం ఏపీయూడబ్ల్యుజే నిజాయితీ, చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. అందువల్లనే దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఏపీ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. యూనియన్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకనుగుణంగా యూనియన్ శాఖలన్నీ కృషి చేయాలని సురేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ సురేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి డి కనకయ్య, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అసోసియేషన్ ఉ పాధ్యక్షులు కేవీ సురేష్ రెడ్డి బాపట్ల జిల్లా యూనియన్ అధ్యక్షులు సీహెచ్ రాంబాబు, గుంటూరు జిల్లా కార్యదర్శి రాంబాబు, ఐజేయూ సభ్యులు కె శ్రీనివాస్, పల్నాడు జిల్లా యూనియన్ నాయకులు ఐజేయూ సభ్యులు శ్రీనివాస్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు బి వెంకటరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి కాశీరావు, ఎం అల్లూరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

