వైద్యులు మెరుగైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలవాలి -జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తూ వాటికి ఐకాన్ గా నిలవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. వైద్యశాఖ పై బుధవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల
సంఖ్య పెరిగిందన్నారు. అయితే దీనిని మరింతగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని, ప్రైవేటు ఆసుపత్రులతో పోటీపడి పని చేయాలని వైద్యులను ఆదేశించారు. ఈ దిశగా తమ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందితో ప్రతివారం సమీక్షిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.
గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు, హైరిస్క్ కేసులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయటం, తద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని పొందటం, బరువు తక్కువ పిల్లల జననం, ఇలాంటి పిల్లల ఆరోగ్య పరిస్థితిని బాలింతల ఇళ్లకు వెళ్లి పారామెడికల్ సిబ్బంది నిరంతరం గమనించడం, మాతా – శిశు మరణాలు, వ్యాక్సినేషన్, దోమల వలన కలిగే వ్యాధులు, వేసవి దృష్ట్యా వచ్చే మూడు నెలల పాటు వడగాలుల వలన ప్రాణ నష్టం జరగకుండా చూసేలా కార్యాచరణ  ప్రణాళిక రూపకల్పన తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని మరింత మెరుగు పర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. తక్షణమే యాప్ లో నమోదు చేయడంలో కుదరకపోయినా వ్యాక్సి నేషన్ వంటి ఫిజికల్ గా చేయాల్సిన పని తక్షణమే చేయాలని కలెక్టర్ చెప్పారు. గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకాలను అదే స్ఫూర్తితో అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ దిశగా మెడికల్ ఆఫీసర్లు దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డీ.ఎం.హెచ్.వో. వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీ.ఎం.హెచ్.వో.లు, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, డీ.ఐ.వో. పద్మజ, మండల మెడికల్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *