బేగంపేట మే 4(జే ఎస్ డి ఎం న్యూస్) :
కాలనీలలోని సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్ లోని సుందర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఇటీవల నూతనంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నూతన కమిటీ సభ్యులు వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులకు తలసాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 10 సంవత్సరాల బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకొని తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నూతన అధ్యక్షుడు అమర్నాథ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రవి కుమార్, ఉపాధ్యక్షురాలు మాలిని మాజీ అధ్యక్షుడు మాచారావు తదితరులు పాల్గొన్నారు.

