జిల్లాలో ఆదివారం జరిగిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయము, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1473 మంది అభ్యర్థులకుగాను 1428 మంది పరీక్షలకు హాజరైనట్లు పరీక్షల నిర్వహణ సిటీ కోఆర్డినేటర్ మనీష్ తెలిపారు. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యము కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. డి.ఆర్.ఆర్.ఎం. మున్సిపల్ హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేసి సదుపాయాలు, చెకింగ్, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

