అద్భుతమైన నేర్పరితనంతో పెన్సిల్ లెడ్లపై శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి తో కలసి ఆత్మార్పణ చేసిన ఆర్యవైశ్యుల 102 ఋషి గోత్రీకుల పేర్లు లిఖించడం అద్భుత పనితనమని, ఎంతో కష్టమైనా… ఇష్టంతో చేయడం వల్లే అద్భుతాల సృష్టి సాధ్యమవుతుందని ఒంగోలు నగర డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పేర్కొన్నారు.
చీరాల వైకుంఠపురం వాస్తవ్యులు అన్నం నరసింహారావు, భ్రమరాంబ దంపతుల కుమార్తె, మైక్రో ఆర్టిస్ట్ అన్నం మహిత పెన్సిల్ లెడ్లపై వాసవి కన్యకాపరమేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యుల ఋషి గోత్రీకుల పేర్లను లిఖించి ఫ్రేమ్ కట్టించి సోమవారం ఉదయం ఒంగోలు విచ్చేశారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రార్థించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ అన్నం మహితను అభినందించి భవిష్యత్తులో మైక్రో ఆర్ట్, మరియు చదువులో ఉన్నతస్థానం పొందాలని ఆశీర్వదించారు.
గతంలో 300 పెన్సిల్స్ పై భగవద్గీతలోని 700 శ్లోకాలను, గత సంవత్సరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్రను లిఖించడం జరిగిందని, అలాగే మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు మరియు పలువురు దేశ నాయకుల లైఫ్ స్టోరీ లిఖించి వారి వారసులకు అందించడం జరిగిందని మహిత తెలిపారు. ఈ 102 ఆర్యవైశ్యుల గోత్రముల ఫ్రేమ్ ను శ్రీ వాసవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 7వ తేదీ పెనుగొండలో వాసవి అమ్మవారి దేవస్థానంలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఎంతోమంది వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారని రాబోవు రోజుల్లో మరిన్ని వినూత్నమైన సూక్ష్మ కళాఖండాలను తయారు చేస్తానని ఈ సందర్భంగా మహిత తెలిపారు. మహితకు ఒంగోలు వాసవి దేవస్థానం వారు అమ్మవారి చీరను, ప్రోత్సాహక కానుక బహుకరించారు.


