ఒంగోలులో ట్రిబుల్ ఐటీ క్యాంపస్ రద్దు అవుతుందన్న కొన్ని పత్రికల కధనాలు అవాస్తవమని విద్యార్దులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గత కొద్ది రోజులుగా ఒంగోలులోని ట్రిబుల్ ఐటి క్యాంపస్ రద్దు అవుతుందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కధనాల దృష్ట్యా ఈ అంశంపై ట్రిబుల్ ఐటీ క్యాంపస్ అధికారులతో గురువారం ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. దీనికి సంబందించి అన్ని విషయాలు మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….. ఒంగోలులో త్రిబుల్ ఐటీ క్యాంపస్ ని రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ ఎస్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నామని అన్నారు. కానీ ఇప్పుడు రావ్ అండ్ నాయుడు కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తోందని తెలిపారు. అందువల్ల రావ్ అండ్ నాయుడు కళాశాలలో మొదటి సంవత్సరం విద్యనభ్యసించే ఇంజనీరింగ్ విద్యార్థులను మాత్రమే ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ క్యాంపస్ కి మార్చడం జరుగుతుందని అన్నారు . ఎస్.ఎస్.ఎన్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ విద్యార్థులు యధావిధిగా ఇక్కడే కొనసాగుతారని తెలిపారు. విద్యార్డులు తల్లితండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. గత ప్రభుత్వం త్రిపుల్ ఐటీ క్యాంపస్ కి భవనాలు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. కొత్త క్యాంపస్ భవనాలు నిర్మించే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వివరించారు .
