మహిళా శక్తిని కుటుంబ, సమాజ చోదక శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. బ్యాంకర్లు కూడా స్వయం సహాయక సంఘ (ఎస్.హెచ్.జి) సభ్యులకు ఈ దిశగా రుణాలు ఇచ్చి అండగా నిలవాలని ఆమె కోరారు. ఎస్. హెచ్.జి. మహిళలకు 2025 -26 ఆర్ధిక సంవత్సరానికి ఇచ్చే వార్షిక రుణ మరియు జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక పై మంగళవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో డీ.ఆర్.డి.ఏ, మెప్మా అధికారులతోనూ, బ్యాంకర్లతోనూ కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …జిల్లా జనాభాలో నాలుగో వంతుగా సుమారు నాలుగున్నర లక్షల మంది స్వయం సహాయక సంఘ మహిళలు ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో బలమైన సంఘటిత ఆర్థిక శక్తిగా స్వయం సహాయక మహిళలు ఉన్నందున ప్రస్తుతం వివిధ ప్రత్యేక ఇతివృత్తాలతో యోగా సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎస్.హెచ్.జి. మహిళలతో యోగాసన కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళా వ్యాపారవేత్త తయారు కావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ దృష్ట్యా వ్యక్తిగత అవసరాల కంటే మెరుగైన జీవనోపాధి కోసం రుణాలు మంజూరు చేసేలా డిఆర్డిఏ ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. డిఆర్డిఏ తో బ్యాంకర్లు సమన్వయం చేసుకోవాలని ఆమె సూచించారు. బోగస్ గ్రూపులను, రుణాలు తీసుకోవడంలో డూప్లికేషన్ లను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులలో 10% నిల్వ ఉంచి మిగతా నిధులను వారికే రుణాలుగా మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేసే క్రమంలో జూన్ 5వ తేదీ నాటికి మన జిల్లాలో 1720 యూనిట్లు అందుబాటులోకి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యమని ఆమె తెలిపారు. వీరికి సుమారు రూ.23 కోట్ల రుణాలు అవసరమని అధికారులు గుర్తించినందున సత్వరమే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.6759.13 కోట్ల రుణ ప్రణాళికను అధికారులు రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం చేయవద్దని, దరఖాస్తును ఆమోదించడమో తిరస్కరించటమో చేయాలి తప్ప పెండింగ్లో పెట్టవద్దని స్పష్టం చేశారు. కొత్త యూనిట్ల ఏర్పాటు కోసం మంజూరు అయిన రుణాల చెక్కులను ఈ సందర్భంగా లబ్దిదారులకు కలెక్టర్ అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక పోస్టరును ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులు, బ్యాంకర్లు ఆవిష్కరించారు.
ఎల్.డీ.ఎం. రమేష్ మాట్లాడుతూ …త్వరగా సబ్సిడీ క్రెడిట్ అయ్యేలా పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకం కింద యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిఆర్డిఏ అధికారులకు సూచించారు. డిఆర్డిఏ పి.డి. నారాయణ మాట్లాడుతూ ఎస్.
హెచ్.జి. మహిళలకు ఇచ్చే వ్యక్తిగత రుణాలకు డిఆర్డిఏ నే షూరిటీ ఇస్తుందని చెప్పారు. లబ్దిదారుల రుణాలు తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
కాగా డిఆర్డిఏ అధికారుల మార్గదర్శకత్వం, బ్యాంకర్ల ఆర్థిక సహాయంతో ఆర్థిక స్వావలంబన సాధించిన పలువురు మహిళా వ్యాపారవేత్తలు ఈ సందర్భంగా తమ అనుభవాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పి.డీ. శ్రీహరి, డిఆర్డిఏ డి.పి.ఎం.లు, ఏ.పి.ఎం.లు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.



