జిల్లా జైలు యొక్క భద్రత దృష్ట్యా మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
ఒంగోలులోని జిల్లా జైలును సందర్శించారు. జిల్లా కారాగారం పరిసరాలను, ఖైదీల గదులు, జైలు హాస్పిటల్ మరియు తదితర అన్ని ప్రదేశాలను జిల్లా ఎస్పీ తిరిగి పరిశీలించారు. అనంతరం జైలులో అంతర్గత భద్రతపై జైలు అధికారులకు మరియు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జైలులో ప్రస్తుతం ఉన్న భద్రతా వ్యవస్థ, భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు మరియు ఇతర విషయాలపై చర్చించి పలు సూచనలు తెలియచేసినారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జైలు భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యున్నత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఖైదీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు నడిచేలా అన్నిముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా జైలుతో పాటు జిల్లాలోని సబ్ జైళ్లలో రిమాండ్ లో ఉన్న ఖైదీలను తరలించే సమయంలో పోలీస్ మరియు జైలు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, జైళ్లలో భద్రతా లోపాలు తలెత్తకుండా అవసరమైన/అదనపు సిబ్బంది ఉండేలా చూసుకోవాలన్నారు. ఖైదీల గదులు, సాధారణ ప్రాంతాలు, సందర్శకుల గదులు మరియు సిబ్బంది ప్రవేశ ద్వారాల వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా, ఖైదీలు అక్రమ వస్తువులు జైలులోకి చేరకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఖైదీలతో సందర్శకుల భేటీని నిబంధనల ప్రకారం మాత్రమే అనుమతించాలన్నారు.
మహిళా ఖైదీలకు ప్రత్యేక భద్రత ఉండేలా చూడాలని, జైలు పరిసరాలు పరిశుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని, ఎటువంటి భద్రతా సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకొనిరావాలని ఎస్పీ గారు సూచించారు. ఖైదీలకు పునరావాస కార్యక్రమాలు, వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలని, తద్వారా వారు జైలు నుండి విడుదలైన తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి తోడ్పాటు లభిస్తుందన్నారు.
ఖైదీల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తూ, ఖైదీలలో పరివర్తన కోసం తీసుకోవలసిన సత్ప్రవర్తనా చర్యలపై జైలు అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు.
జిల్లా ఎస్పీ వెంట జైలు సూపరింటెండెంట్ పి. వరుణా రెడ్డి, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐ సీతారామి రెడ్డి, జిల్లా జైలర్ రమేష్, యం.శ్రీనివాసరావు, యన్.శ్రీనివాసరావు మరియు కారాగార వైద్యాధికారి డా॥ యస్.వి.యస్.బ్రహ్మతేజ మరియు తదితరులు ఉన్నారు.






