ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంతో 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ప్రదేశాల్లో యోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
“యోగాంధ్ర- 2025” మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సింగరాయకొండ మండలం, పాకల బీచ్ లో ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పి ఏ ఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించి యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…యోగా భారతీయ సంస్కృతిలో భాగమని, దీనిని మనందరం ఆచరించాలన్నారు. వన్ ఇయర్…వన్ హెల్త్ పేరుతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో యోగ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించగా ఇప్పటికే గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద, త్రిపురాంతకం దేవస్థానం వద్ద, కొత్త పట్నం బీచ్ వద్ద యోగ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందని, ఈ రోజు పాకల బీచ్ నందు యోగ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారన్నారు. 21వ తేదీన రాష్ట్రంలోని లక్ష ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జూన్ 21 న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. దీంతో పాటు 25 వేల మంది పిల్లలు 125 సూర్య నమస్కారాలు చేయబోతున్నారని మంత్రి వివరించారు. ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ యోగ సాధన చేస్తూ ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పేర్కొన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి, యోగాను వారి జీవనశైలిలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, ఆ రోజున విశాఖపట్నం బీచ్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మందితో యోగ నిర్వహిస్తుందన్నారు. ఆ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి పాల్గొంటారని, అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ఒక లక్ష ప్రదేశాల్లో యోగ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు. జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగస్వాములు అయ్యేందుకు ఇంతవరకు జిల్లాలో 9.60 లక్షల మంది యోగాంధ్ర యాప్ లో నమోదయ్యారన్నారు. యోగాంధ్ర కార్యక్రమం కింద పర్యాటక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగ అభ్యసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పర్యాటక ప్రదేశాలు అయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు, త్రిపురాంతకం దేవస్థానం, కొత్తపట్నం బీచ్ నందు యోగ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగంగా చేసుకుని ఆరోగ్యమైన జీవితాన్ని పొందాలన్నారు.
జిల్లా ఎస్ పి ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ, యోగ ను మన జీవితంలో భాగం చేయడంతో పాటు యోగ యొక్క గొప్ప తనాన్ని ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర క్యాంపెయిన్ జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. మంచి ఆరోగ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇచ్చే యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలన్నారు. యోగ దినోత్సవాన్ని గౌరవ భారత ప్రధాని గారు వైజాగ్ లో ప్రారంభించడం జరుగుతుందని, ఈ యోగ కార్యక్రమంలో 5 లక్షల మందితో పాల్గొంటారని తెలియచేస్తూ, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ, ఈ నెల 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో యోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ప్రకాశం జిల్లాలో 6,758 ప్రదేశాల్లో యోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2047 నాటికి ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మాసోత్సవాలు జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ నెల 20వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యులతో పెద్దఎత్తున యోగ కార్యక్రమాన్ని జరుపుకోనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. అలాగే 21న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ యోగ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
యోగ గురువు పతంజలి బాల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈ యోగాసనాలు నిర్వహించడం జరిగింది.
ఈ యోగ కార్యక్రమంలో ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, ఆయుష్ ఆర్ డి డి పద్మజాతి, పశుసంవర్థక శాఖ డిడి రవి కుమార్, బిసి కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు, మెప్మా పిడి శ్రీహరి, డిపిఓ వెంకట నాయుడు, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగ సాధకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









