కౌలు రైతులకు, అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు,
పిఎం సూర్యఘర్ యోజన పధకం లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారత తో వ్యహారించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ ( డి. సి. సి ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ ( డి.ఎల్.ఆర్.సి) బ్యాంకర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పధకాలకు సంబంధించి లబ్దిదారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు రుణాల మంజూరు మరియు పిఎం సూర్య ఘర్ పధకం క్రింద లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.25,045.91 కోట్ల గా నిర్ణయించడం జరిగిందని ఈ లక్ష్య సాధనకు బ్యాంకర్లు తమ వంతు కృషి చేయాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.20,591.18 కోట్ల గా నిర్ణయించగా, 2025 మార్చి 31వ తేదీ నాటికి 25,444.91 కోట్ల రుణాలు అందచేసి 123.57 ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. 2025-26 ఈ ఆర్ధిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి ఖరీప్ లో రూ.4197.42 కోట్లు, రబీ లో రూ. 6040.00 లక్ష్యం గా నిర్దేశించడం జరిగిందని, ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సి కార్డ్ ఉన్న ప్రతి కౌలు రైతుకు వారి అర్హత మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో పశు, మత్స్య సంపదను వృద్ది చేసేలా రుణాలను అందజేసి, పాడి రైతులను, మత్స్యకారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ , బ్యాంకర్లను కోరారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరం 2024-25లో 32,657 స్వయం సహాయక సంఘాలకు 1671.03 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 2025 మార్చి 31వ తేదీ నాటికి 17,584 స్వయం సహాయక సంఘాలకు 1421.28 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు చేసి 85.05 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే మెప్మా ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 2620 స్వయం సహాయక సంఘాలకు 104.80 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 2025 మార్చి 31వ తేదీ నాటికి 4255 స్వయం సహాయక సంఘాలకు 681.85 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందుకు సంబంధించి అర్హత పొందిన లబ్దిదారులకు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పధకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ ద్వారా జరుగుచున్న పొలంబడి కార్యక్రమంలో బ్యాంకర్లు కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, బ్యాంకర్లను ఆదేశించారు. ప్రధాన మంత్రి జనధన్ యోజన ( పి.ఎం.జె.డి.వై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ( పి.ఎం.ఎస్.బి.వై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ( పి.ఎం.జె.జె బి.వై ), అటల్ పెన్షన్ యోజన ( ఏ.పి.వై ) వంటి ఆర్థిక స్వావలంబన పథకాలపై ప్రజలకు వచ్చే జులై 1 వ తేది నుండి సెప్టెంబర్ 30 వరకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బ్యాంకర్లు విధిగా ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, నగదు రహిత లావాదేవీలు పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, గృహ ఆధారిత రంగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి రుణ సౌకర్యం బ్యాంకర్లు సహకరించాలన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ప్రకారం 5,000 మందికి పైగా జనాభా కలిగి, బ్యాంకింగ్ సౌకర్యం లేని దర్శి మండలంలోని పాతకామూరు, పుల్లలచెరువుమండలంలోని ముతుకుల, యెర్రగొండపాలెం మండలం లోని వెంకటాద్రిపాలెం గ్రామాలను గుర్తించిందని, ఈ గ్రామాల్లో వీలైనంత త్వరగా బ్యాంకు శాఖలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎల్డిఎం ను ఆదేశించారు.
అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ శ్రీ రమేష్, డిఆర్డిఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ, శ్రీహరి , వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, రవి కుమార్, శ్రీనివాస రావు, పరిశ్రమల శాఖ జి ఎం శ్రీ శ్రీనివాస రావు, ఎస్.సి కార్పోరేషన్ ఈడి అర్జున నాయక్, సిపిడిసిఎల్ ఎస్.ఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

