ఒంగోలు నగరంలోని గిరిజన భవనమును ఆయా సామాజిక వర్గాల సంస్కృతి ప్రతిబింబించేలా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
చెప్పారు. మంగళవారం ఆమె భవనాన్ని సందర్శించారు. ప్రాంగణం మొత్తం కలియ తిరిగి ఇందులోని వసతులను పరిశీలించారు. వాటి స్థితిగతులను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. మున్సిపాలిటీ నుంచి నీటి కనెక్షన్ కావాల్సి ఉన్నదని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, భవనములో ఏసీలు, ఇతర ఫర్నిచర్ అవసరం ఉన్నదని చెప్పారు. అదేవిధంగా భవనం వెనక వైపునకు జీజీహెచ్ ( రిమ్స్ ) ప్రాంగణంలో నుంచి ప్రవేశించేలా ఒక గేటును కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను కలెక్టరుకు అందించారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ఉన్నదని, ఈలోగా ఈ భవనాన్ని ఆధునీకరించి అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు సమకూర్చిన తరువాత ప్రైవేటు కార్యక్రమాలకు కూడా ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా నిర్వహణకు అవసరమైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ అధికారిని కలెక్టరు ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డ్వామా పి.డి. జి.జోసఫ్ కుమార్, గనుల శాఖ డి.డి. రాజశేఖర్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, ఏపీఈడబ్ల్యూఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ బాబు, తహసిల్దార్ మధుసూదన్ రావు, ఇతర అధికారులు ఉన్నారు.

