కొండపి నియోజకవర్గంలో నూతన బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. శనివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లోని క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో విడివిడిగా మంత్రి డా. స్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అవసరమైన చోట కొత్తగా బోర్లు వేయించాలన్నారు. రామతీర్థం నుంచి మర్రిపూడి మండలంలోని పలు గ్రామాలకు త్రాగునీటి సరఫరాపై అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాల్లో పరిశుభ్రత పారిశుద్ధ్యనికి పెద్ద పీట వేయాలని డయేరియా ప్రబలకుండా
జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో నూతన బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు.

