శ్రీ మహా వారాహి నవరాత్రుల సందర్భంగా జులై 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు మూడు రోజులు పాటు స్థానిక శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం గోశాలలో “గో త్రిరాత్ర హోమం” గో ఉపాసకులు శ్రీసురాభిదాసు బ్రహ్మశ్రీ కుందుర్తి మహీకిరణ్ శర్మ యాగ్నికత్వంలో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు శుక్రవారం రాత్రి శ్రీ మహి వరాహ (వారాహి) హోమం అర్ధరాత్రి వేళ యజ్ఞ క్రతువులో శాస్త్రోక్తంగా సమిధలను మంత్రించి హోమాగ్నిని రగిలించారు. కార్యక్రమానికి ముందుగా మహికిరణ్ శర్మ వరాహ నరసింహస్వామి వారాహి దేవి వివరణను వారి వృత్తాంతాన్ని విపులీకరించారు. మధ్య మధ్య అద్భుతమైన తమ గాత్రంతో స్వామి పాటలను స్తోత్రాలను పటిస్తూ క్రతువులో పాల్గొన్న భక్తి ఆరాధనతో పాల్గొన్న హోమకర్తలకు ఉత్సాహాన్ని, భక్తిని ప్రేరేపించారు. దేవతలకు తృప్తి కలిగించడానికి హోమాలు నిర్వహిస్తామని, తద్వారా దుష్ట పీడలన్నీ తొలగి సౌభాగ్యము, సంపదలు, ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయని వివరించారు. తూనుగుంట మల్లికార్జునరావు దంపతులచే పూర్ణాహుతి కావింపజేశారు.
శనివారం శ్రీ గోవింద నామావళి హోమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దంపత సమేతంగా హోమకర్తలు పాల్గొన్నారు శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం అధ్యక్షులు చలువాది వెంకట శ్రీనివాస్ మూర్తి, కార్యదర్శి చలువాది బ్రహ్మయ్య, కోశాధికారి పేర్ల వెంకట నరసింహారావు, సహకార్యదర్శి గుర్రం బద్రీ నారాయణ, వేమూరి చక్రధర పెరుమాళ్ళు, శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధా రామణ గుప్త జంధ్యం, సహకార దర్శి నేరెళ్ల శ్రీనివాసరావు మరియు పౌర్ణమి తిథి గిరి ప్రదక్షిణ నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొన్నారు.


