నిరక్షరాస్యులైన వయోజనులను కూడా అక్షరాస్యులుగా మార్చే ‘ అక్షర ఆంధ్ర ‘ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ (ఇన్చార్జి) ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనములో జరిగింది. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ ఉల్లాస్ ‘ పథకములో భాగంగా 2025 – 26 విద్యా సంవత్సరంలో ‘ అక్షర ఆంధ్ర ‘ అనే ప్రత్యేక సాక్షరత
కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్ మోహన్ రావు ఈ సందర్భంగా వివరించారు. 2029 సంవత్సరం నాటికి 15 – 59 సంవత్సరముల వయసుగల వారందరూ చదవటం, రాయటం నేర్చుకునేలా చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని చెప్పారు. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 1,29,497 ని అక్షరాస్యులుగా చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే వీరిని గుర్తించినందున వాలంటీర్ టీచర్లకు అనుసంధానం చేసి అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాల భవనాలలో వీరికి బోధించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. మొత్తం 100 గంటలపాటు పాఠ్యాంశాల బోధన ఉంటుందని, ఇందులో 15 గంటలు ఆడియో విజువల్, 40 గంటలు తరగతి బోధన, 45 గంటలు సాధన ఉంటుందని తెలిపారు. ఫంక్షనల్ లిటరసీ, డిజిటల్ మరియు ఫైనాన్షియల్ లిటరసీ కోసం 42 డిజిటల్ వీడియోలను మొబైల్ ఫోన్ ద్వారా వయోజన విద్యాశాఖ అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పరిషత్, డీఆర్డిఏ, మెప్మా, ఐసిడిఎస్, పంచాయతీ, విద్య, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని క్షేత్రస్థాయిలో భాగస్వాములను చేసినట్లు వివరించారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మండల స్థాయిలో జరిగే శిక్షణకు పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇతర సచివాలయ సిబ్బంది మరియు గుర్తించబడిన వాలంటీర్ టీచర్లు హాజరయ్యేలా చూడాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బోధన ప్రారంభమయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినందున, దీనికి సంబంధించిన వాలంటీర్ టీచర్ల గుర్తింపు, శిక్షణ కార్యక్రమాలను ప్రణాళిక మేరకు ఈ నెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డీఈవో కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


