ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ను జిల్లా లోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలలో ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తేసుకోవాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ
అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఓ లు, మండల విద్యా శాఖాదికారులతో వర్చువల్ గా సమావేశమై ఈ నెల 10న జిల్లా లో జరగనున్న మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లు పై సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిని నిర్దారించడానికి పాఠశాల విద్య, సమాజ భాగస్వామ్యంతో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం 2,955 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ, మరియు 188 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని, అలాగే పూర్వ విద్యార్ధులను, అక్కడే చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన గొప్ప వ్యక్తులను కూడా ఆహ్వానించి సన్మానించాలని సూచించారు. కార్యక్రమానికి విద్యార్థులందరూ యూనిఫామ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ‘మెగా పేరెంట్స్ మీట్’ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, తల్లితండ్రులు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. తల్లితండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఫోటో సెషన్ నిర్వహించాలని, అమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా తల్లికి వందనం నిర్వహించాలన్నారు. ఈ సమావేశం లోపలే విద్యార్ధులందరికీ వైద్య పరీక్షలు జరిపి వారి ఆరోగ్య స్థితి పై 10 న వారికీ అందించే హోలిస్టిక్ కార్డ్స్ నందు రిమార్క్స్ కాలం లో రిపోర్ట్ చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఓ లు, మండల విద్యా శాఖాదికారులు 10న జరిగే మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ లో ఏదో ఒక స్కూల్ లో పాల్గొనాలని సూచించారు.
పిల్లల లోని సృజనాత్మకతను వెలికి తీసీ పలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని, అలాగే తల్లి దండ్రులకు కూడా రంగోలి, టగ్ అఫ్ వార్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. మానసిక ఆరోగ్యం, సైబర్ క్రైమ్ పై అవగాహన, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ‘మెగా పేరెంట్స్ మీట్’ కార్యక్రమం నిర్వహించేలా సంబందించి పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలన్నారు. ‘మెగా పేరెంట్స్ మీట్’ కార్యక్రమం ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమం ఏర్పాట్ల పనులు, 10 వతేదీన ‘మెగా పేరెంట్స్ మీట్’ కార్యక్రమం నిర్వహణను లీప్ యాప్’ లో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం భోజనం సమయం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనాన్ని కూడా చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం భోజనం పై తల్లిదండ్రుల నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసం మెనూ కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు “ఏక్ పేడ్ మాకే నామ్ పర్”అంటే తల్లి పేరుతో ఒక మొక్కను కూడా అందించి నాటడం జరుగుతుందన్నారు. ఇందుకోసం సామాజిక అటవీ విభాగం, విద్యా శాఖ సమన్వయంతో అన్ని పాఠశాలలకు మొక్కలను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అలాగే తల్లికి వందనం సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించి వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా విద్యా శాఖాదికారి కిరణ్ కుమార్, ఆర్ఐఓ సైమన్ విక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీ లక్ష్మా నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, తదితర అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి నియోజక వర్గ మరియు మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఓలు, మండల విద్యా శాఖాదికారులు తదితరులు పాల్గొన్నారు.

