హాస్టళ్ళలోని విద్యార్థులకు చదువుతోపాటు వారి ఆరోగ్యం పైనా అధికారులు దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. శనివారం మార్కాపురంలోని ఎస్సీ బాలికల హాస్టలును ఆమె సందర్శించారు. హాస్టల్ లోని సదుపాయాలను, వంటగదిని పరిశీలించారు. రాత్రి భోజనం కోసం వండుతున్న అన్నం రుచి చూశారు. విద్యార్థినులతో ఏకాంతంగా మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు రూపంలో రాసి కంప్లైంట్ బాక్స్ లో వేయాలని వారికి చెప్పారు. ఈ దిశగా ఒక ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యక్తిగత శుభ్రత, సరైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుంచే అలవాటు చేసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. రక్తహీనత, ఇతర వైద్య పరీక్షలను రెగ్యులరుగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన రిజిస్టర్ పక్కాగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా నివారణ అధికారి మధుసూదన్ రావు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త హేమంత్, తహసిల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు ఉన్నారు.


