ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు “పల్లెనిద్ర” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. ప్రజాసేవలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తోందని జిల్లా ఎస్పీ అన్నారు.
పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి బస చేసి, ప్రజలతో మమేకమవుతున్నారు. పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మార్చి నుండి జూలై వరకు జిల్లావ్యాప్తంగా గ్రామాలలో 650 కు పైగా కార్యక్రమాలను నిర్వహించినట్లు, ఇందులో డి.ఎస్.పిలు, సి.ఐలు, ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. ప్రజలు శాంతియుత జీవనం గడపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కోరారు.
పల్లెనిద్రలో భాగంగా పోలీసు అధికారులు ప్రజల సమస్యలను నేరుగా వింటున్నారు. ఒక సమస్య తీవ్రంగా మారకముందే, ప్రారంభ దశలోనే దాని పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. పల్లెనిద్ర ద్వారా పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామన్నారు.
ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్ ఫ్రాడ్స్, ఏ.పి.కె ఫైల్స్ ఫ్రాడ్స్ వంటి సైబర్ నేరాల గురించి ప్రజలకు వివరించి, అపరిచిత కాల్స్, లింకులను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణ, హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, ఇటీవల జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడుతున్నారన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, చట్టాల గురించి, అలాగే గంజాయి మరియు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. నేరాల నివారణకు, నిందితులను పట్టుకోవడానికి సి.సి.టి.వి. కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ వాటిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు మరియు ప్రజల భద్రతను పెంపొందించేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం జరిగిందని, ట్రాఫిక్ నియంత్రణ, నిర్మానుష్యమైన ప్రదేశాలలో బహిరంగంగా మద్యం సేవించడం, నేరాలు జరగటానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలు, ఈవిటిజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట,జూదం తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్నామన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజలు తమ వంతు సహకారాన్ని అందిస్తే అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయవచ్చని తెలిపారు.
గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడటమే కాదు, ప్రజలతో నేరుగా మాట్లాడే, చైతన్యం కలిగించే కార్యక్రమంగా ఇది అమలు చేస్తున్నట్టు వివరించారు. జిల్లావ్యాప్తంగా నేర నివారణలో ప్రజలను భాగస్వాములుగా మార్చేందుకు “పల్లె నిద్ర” ఒక గొప్ప వేదికగా మారుతోందన్నారు.




