అపహరణకు గురైన బాలికను కేవలం గంట వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులు-బాలిక ఆచూకీ కొనుగొనుటకు జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు -తమ బాలికను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మరియు ప్రజలు

ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ ఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి, అపహరణకు గురైన 8 సంవత్సరాల బాలికను గంట వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
రాచర్ల మండలంలోని అనుములవీడు హైస్కూల్‌లో నాలుగవ తరగతి చదువుతున్న బాలికను, గుర్తుతెలియని వ్యక్తి ఒకరు స్కూల్‌కి వచ్చి మీ నాన్న పిలుస్తున్నారు, అంటూ నమ్మించి కారులో తీసుకెళ్లారు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ఉదయం 08:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. 10.30 నిమిషాలకు బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు రాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాచర్ల పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ ఈ కిడ్నాప్‌ను అత్యంత తీవ్రంగా పరిగణించి, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, చుట్టుపక్కల జిల్లాలైన కర్నూలు, కడప, పల్నాడు,బాపట్ల మరియు నెల్లూరు జిల్లాల ఎస్పీలకు కూడా సమాచారం అందించి అప్రమత్తం చేశారు. జిల్లా అంతటా మరియు సరిహద్దుల్లోని అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన విస్తృత తనిఖీలు మరియు ఆకస్మిక తనిఖీలను గమనించిన కిడ్నాపర్లు భయపడిపోయి, వారు పెద్దారవీడు, దేవరాజు గట్టు వద్ద బాలికను వదిలి పారిపోయారు. బాలికను గుర్తించిన పోలీసులు బాలికను సురక్షితంగా రక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ.. సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల త్వరితగతిన చర్యలు తీసుకోగలిగామని, ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

తమ బిడ్డ అపహరణకు గురైన వెంటనే ఆందోళనతో, భయంతో ఉన్న సమయంలో, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ స్వయంగా ఫోన్ చేసి, భయపడకండి, రెండు మూడు గంటల్లోగా మీ పాపను క్షేమంగా మీ వద్దకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. జిల్లా ఎస్పీ మాటలు విన్న తరువాత మేము కొంతమేర ధైర్యంగా ఉండగలిగామని, కేవలం ఒక గంటలోనే మా పాప కనిపించిందని తెలిసి ఎంతో ఆనందించామని తెలిపారు. రాష్ట్రంలోనే ఈ జిల్లా ఎస్పీ మరియు పోలీసులు చూపిన ప్రత్యేక చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీసు శాఖకు హృదయపూర్వక అభినందనలు, అలాగే వేగంగా స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

బాలికను గుర్తిoచుటలో అత్యంతప్రతిభ కనపరిచిన మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, గిద్దలూరు రూరల్ సీఐ జె.రామకోటయ్య, రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు, జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీగారు ప్రత్యేకంగా అభినందించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *