ఆగస్టు 15న నిర్వహించబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, పోలీసు పరేడ్ గ్రౌండ్ ను సందర్శించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించి, ఆయా శాఖల అధికారులు నిర్వర్తించవలసిన విధులను వారికి వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. పోలీసు గౌరవ వందనం, కవాతు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు, ప్రజా ప్రతినిధులకు సీటింగ్ ఏర్పాట్లు, ఆహ్వానం, అదేవిధంగా స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలన్నారు. ఉద్యోగులకు అందించే ప్రశంస పత్రాల విషయంలో కాలయాపన కాకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సంక్షేమ అభివృద్ధిని ప్రతిబింబించేలా, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఉండాలన్నారు. అదేవిధంగా జిల్లా సాధించిన ప్రగతిని వివరించేలా కూడా స్టాల్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. దేశభక్తిని చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వర్షాలు పడుతున్నందున కార్యక్రమానికి ఎలాంటి అవరోధం కలగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని, కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్నాక్స్, తాగునీరు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమన్వయం చేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, డ్వామా, డి ఆర్ డి ఏ పీడీలు జోసెఫ్ కుమార్, నారాయణ, డీఈవో కిరణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జెడి రవి కుమార్, డిడి మైన్స్ రాజశేఖర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపీచంద్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


