గణేష్ నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అన్నారు.గురువారం హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్‌లోని టీజీఐసీసీసీ భవనంలో అంతర్-విభాగ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారులు, హైడ్రా, అగ్నిమాపక సేవలు (ఫైర్ సర్వీసు), పర్యాటక శాఖ (టూరిజం శాఖ), సమాచార శాఖ, రవాణా (ట్రాన్స్ పోర్టు), వైద్య శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పలు సమస్యలపై మాట్లాడారు. ముఖ్యంగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం, రాత్రి వేళల్లో నిరంతరాయంగా విద్యుత్ దీపాలు ఉండేలా చూడటం, నిమజ్జనం రోజున భక్తులకు సరిపడా తాగునీటి సౌకర్యాలు కల్పించడం, విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన వాహనాలను మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉంచడం వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, గణేష్ నిమజ్జనం సందర్భంగా మార్గమధ్యంలో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని కూడా విజ్ఞప్తి చేశారు.ఈ సమస్యలపై స్పందించిన సంబంధిత శాఖల అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ మాట్లాడుతూ, విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బేబీ పాండ్స్, క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 160 స్పెషల్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదనంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలు, మొబైల్ టాయిలెట్లు, అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నిమజ్జనం రోజు కోసం బారికేడ్లను సమకూరుస్తామని తెలిపారు.
మెట్రో రైలు అధికారులు కూడా అర్ధరాత్రి వరకు అదనపు ట్రిప్పులు నడిపిస్తామని తెలిపారు. అన్ని మండపాల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రాత్రి వేళల్లో కూడా సిబ్బందిని, అధికారులను నియమిస్తున్నామని జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డెవిస్, తెలిపారు.
టీజీఐసీసీసీ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేశామని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఇక్కడి నుంచే నిఘా కొనసాగుతుందని తెలిపారు.
సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించాలని మండప నిర్వాహకులను కోరారు. అలాగే, మండప నిర్వాహకులు తమ విగ్రహాల వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం ఇవ్వడం ద్వారా తగిన ఏర్పాట్లు చేయడానికి, పోలీసు శాఖ తరపున సరైన భద్రత, సీసీటీవీల ద్వారా నిఘా ఉంచడానికి వీలుంటుందని వివరించారు.మండపాల వద్ద సేవా దృక్పథం ఉన్న వాలంటీర్లనునియమించుకోవాలని, ట్రాఫిక్‌కు, భక్తులకు, సామాన్య ప్రజలకు అంతరాయం కలగకుండా పోలీసులతో పాటు వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి పండుగకు భక్తుల సంఖ్య పెరుగుతున్నందున, ఎలాంటి సంఘటనలు జరగకుండా మండప నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపారు. డీజే సిస్టమ్ వలన వృద్ధులకు, పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున గణేష్ ఉత్సవ సమితి వారు సహకరించాలని కోరారు. ఆర్టీసీ అదనంగా డ్రైవర్లను, మెకానిక్‌లను నిమజ్జనం కోసం సమకూర్చుకోవాలని కోరారు.
గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ఉత్సవాలను జరుపుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. గణేష్ నవరాత్రులకు హైదరాబాద్ సిటీ పోలీసు తరపున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరము వినాయక చవితి నవరాత్రులు మరియు మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేసారి వస్తున్నందున అందరూ సమన్వయంతో పోలీసులతో సహకరించాలని కోరారు.
ఈ సమన్వయ సమావేశానికి అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అడిషనల్ సీపీ క్రైమ్ పి. విశ్వ ప్రసాద్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డెవిస్, ఐపీఎస్, హైడ్రా కమిషనర్ ఆర్.వి. రంగనాథ్, ఐపీఎస్, టీజీఐసీసీసీ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి, జాయింట్ సీపీ సైబరాబాద్ గజరావు భూపాల్, హైదరాబాద్ సిటీ పోలీసు అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి, శశీధర్ రెడ్డి, సందీప్ రాజ్ మరియు ఖైరతాబాద్ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.





