ప్రకాశం జిల్లా, చీమకుర్తిలో 8వ తరగతి చదువుతున్నబాలిక అపహరణ ఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి, అపహరణకు గురైన 13 సంవత్సరాల బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం మువ్వవారిపాలెం గ్రామానికి చెందిన 13సంవత్సరాలు బాలిక చీమకుర్తిలోని విద్యానికేతన్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన వేడుకలకు హాజరైన ఆ బాలిక, మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో పాఠశాల వెలుపల వచ్చే క్రమంలో గతంలో బాలిక తండ్రికి తిరుపతిలో నివాసం ఉన్నపుడు పరిచయం ఉన్న వ్యక్తి, బాలిక తండ్రి వద్ద రావలసిన బాకీ రాబట్టుటకు కిడ్నప్ చేయాలని ఉద్దేశ్యంతో, బాలికతో ఇంటికి వెళదామని వట్టి చేతులతో ఇంటికి వెళ్లకూడదని స్వీట్స్ తీసుకోని వెళదామని చెప్పి తన బైకు మీద తీసుకొని తిరుపతి వైపుకు పారిపోయుటకు ప్రయత్నించి దొరికినాడు. దారిమధ్యలో తండ్రితో ఫోన్లో మాట్లాడి డబ్బులు ఇస్తే పాపను వదిలేస్తాను, లేదంటే చంపేస్తానని అని బెదిరించినాడు.
చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు సమాచారం ఇచ్చిన మేరకు చీమకుర్తి పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ ఈ కిడ్నాప్‌ను తీవ్రంగా పరిగణించి, తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా అంతటా మరియు సరిహద్దుల్లోని అన్ని చెక్ పోస్టులను, పొరుగున ఉన్న నెల్లూరు జిల్లా పోలీసులను అప్రమత్తం చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో బైక్ నెంబర్ ను వారి యొక్క కదలికలను గుర్తించటం జరిగింది. ఆ పాపను ప్రత్యేక బృందాలు కావలి సమీపంలో తిరుపతి ప్రాంతానికి చెందిన ఆర్. ఈశ్వర్ రెడ్డి (33) అనే నిందితుడు చేరనుండి బాలికను కూడా సురక్షితంగా రక్షించారు.
ఫిర్యాదిదారుడు గతంలో తిరుపతిలో ఉన్నాడని, ముద్దాయి ఫిర్యాది ఇంటి దగ్గరలో పరిచయంగా ఉండి వారి మధ్య డబ్బులకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఫిర్యాది దగ్గర డబ్బులు తీసుకోవటానికి ఈ పథకం ప్రకారం బాలికను కిడ్నిప్ చేసి డబ్బులు ఇస్తేనే మీ పాపను వదిలిపెడతాను, ఇవ్వకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. ప్రస్తుతానికి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటన నేపథ్యంలో, ప్రతి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పిల్లల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పాఠశాలలకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు పిల్లలు జాగ్రత్తగా ఉండేలా చూడాలి. అలాగే, గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడినప్పుడు లేదా వాహనాల్లో ఎక్కమన్నప్పుడు వారికి దూరంగా ఉండాలని పిల్లలకు నేర్పించాలి. భద్రతా విషయంలో ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు లేదా తల్లిదండ్రులకు తెలియజేసేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. అన్ని విద్యాసంస్దలు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తమ బిడ్డ అపహరణకు గురైన వెంటనే ఆందోళనతో, భయంతో ఉన్న సమయంలో, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐ.పి.ఎస్. స్వయంగా ఫోన్ చేసి, భయపడకండి, మీ పాపను క్షేమంగా మీ వద్దకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. ఆ మాటలు విన్న తరువాత మేము కొంతమేర ధైర్యంగా ఉండగలిగామని, రాష్ట్రంలోనే ఈ జిల్లా ఎస్పీ చూపిన ప్రత్యేక చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, మా బిడ్డను సురక్షితంగా రక్షించిన పోలీసు శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు అని , అలాగే వేగంగా స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
బాలికను గుర్తిoచుటలో అత్యంతప్రతిభ కనపరిచిన ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ సుబ్బారావు, చీమకుర్తి ఎస్సై కృష్ణయ్య, ప్రకాశం, నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులు, చీమకుర్తి హెడ్ కానిస్టేబుల్ రాయుడు, కానిస్టేబుల్ అనిల్, నాయుడు,విజయ్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు.





