” పైనుంచి పట్టించుకునే వారు లేరు…. కింద స్థాయిలో పనిచేసే వారు లేరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. మీ నిర్లక్ష్యం వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుంది. సిగ్గుగా లేదా..?. ఉన్నత స్థాయిలో ఉన్న మీరు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షించకుండా ఏమి చేస్తున్నట్లు?. పద్ధతి మార్చుకోకపోతే ప్రభుత్వానికి మిమ్ములను సరెండర్ చేస్తాను “… అని వైద్య శాఖ ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
హెచ్చరించారు. వైద్యశాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం జిజిహెచ్, మాతాశిశు ఆసుపత్రితో పాటు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోని మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది – ఖాళీలు, వైద్య సంబంధ భవన నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు.
డెలివరీ, సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల కేసుల నమోదు తదితర వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆయా కేసుల చికిత్సకు అవసరమైన మందులను పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులలో వైరల్ జ్వరాల కేసులు నమోదు అయితే ఆ వివరాలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి కచ్చితంగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. వైరల్ జ్వరాలను గుర్తించడంలో క్షేత్రస్థాయిలో ఆశాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గాడిలో
పడుతున్నాయని, సెకండరీ లెవెల్ ఆస్పత్రులలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మీ పరిధిలోని ఆసుపత్రులపై దృష్టి సారిస్తున్నారా… లేదా..?. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీలను నియమించరా..? కనీసం సమీక్షా సమావేశానికి వచ్చేటప్పుడు కూడా నివేదికలు సమగ్రంగా తయారు చేసుకుని రారా ..? ” అని డిసిహెచ్ఎస్ శ్రీనివాస నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని గత నెలలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో కలిసి తాను తనిఖీ చేసినప్పుడు చర్చకు వచ్చిన సమస్యల పరిష్కారానికి మీరేమి చర్యలు తీసుకున్నారు ..? నాకు రిపోర్టు పంపించాలని చెప్పాను కదా.! ఎందుకు పంపించలేదు..? మీ స్థాయిలో మీరు చెయ్యరు .. నేను చెప్పిన పనీ చేయరా..!?”.. అని మార్కాపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెడెంటు రామచంద్ర రావును కలెక్టర్ ప్రశ్నించారు. కీలకమైన శాఖలోని ఉన్నతాధికారుల్లో ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు అందరూ తమ పరిధిలోని ఆసుపత్రులపై మరింతగా దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్య సేవలపై ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రోగులతో ప్రవర్తించే తీరుపై ఆసుపత్రిలోని వైద్యులకు, సిబ్బంది అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తేలికగా తీసుకోవద్దని, క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఒంగోలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మాణిక్యరావు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సూపరింటెండెంట్లు, ఏపీఎంఎస్ ఐడిసి అధికారులు, డిప్యూటీ డిఎంహెచ్వోలు, తదితరులు పాల్గొన్నారు.

