ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులు, సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు చేపడుతున్నారు. మద్యం దుకాణాల సమీప ప్రాంతాల్లో, బస్టాండ్‌లు, పార్కులు, రోడ్డుపై, ఇతర ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రజలు ఇబ్బంది పడేలా ప్రవర్తించే వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు నిర్మానుష్య ప్రాంతాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మందుబాబులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విధమైన తనిఖీలు కూడా కొనసాగుతాయని ఎస్పీ తెలియజేశారు.
ప్రజలంతా పోలీసులకు సహకరించాల్సిందిగా, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వెంటనే డయల్ 112 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.


