పాత కక్షలతోనే ఏసీ టెక్నీషియన్ హత్య.ఇద్దరు నిందితుల అరెస్ట్.

చిలకలగూడ ఏప్రిల్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పాత కక్షలు, మద్యం గొడవలు ఒక ప్రాణాన్ని
బలితీసుకున్నాయి. పద్మారావు నగర్‌లో సంచలనం సృష్టించిన ఏసీ టెక్నీషియన్ అలీమ్ హత్య కేసును చిలకలగూడ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ పాశవిక హత్యకు పాల్పడిన నజ్ముద్దీన్ అలియాస్ జహంగీర్ , సయ్యద్ ఇలియాస్ అనే ఇద్దరు నిందితులను శనివారం ఉదయం ముషీరాబాద్‌లోని గోల్డెన్ క్రౌన్ హోటల్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ అలీమ్ (43) ఏసీ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. ఈ నెల 23న సాయంత్రం పద్మారావు నగర్ కె.వి.కె వైన్స్ సమీపంలో నిందితులు జహంగీర్, ఇలియాస్‌లతో కలిసి అలీమ్ మద్యం సేవించాడు. ఆ సమయంలో మద్యం, జూదానికి సంబంధించిన పాత ఆర్థిక లావాదేవీలపై వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గతంలో తనను అలీమ్
అవమానించాడనే కక్షతో ఉన్న జహంగీర్, తన స్నేహితుడు ఇలియాస్‌తో కలిసి పథకం ప్రకారం దాడికి దిగాడు. ఇలియాస్ తన వద్ద ఉన్న పదునైన కత్తితో అలీమ్ ముఖంపై బలంగా పొడవడంతో, తీవ్ర రక్తస్రావమై అలీమ్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
ఈ ఘటనపై మృతుడి కుమారుడు మొహమ్మద్ అమన్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని, రక్తపు మరకలతో ఉన్న చొక్కాను మరియు ఒక యాక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సయ్యద్ ఇలియాస్‌పై గతంలోనే ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఒక హత్యాయత్నం కేసు నమోదై ఉంది.ఈ విలేఖరుల సమావేశంలో సికింద్రాబాద్ జోన్ డి.సి.పి రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డి.సి.పి జె. నరసయ్య, ఏ.సి.పి కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ వి. రామకృష్ణ బృందం ఈ కేసును ఛేదించింది. నిందితులను త్వరగా పట్టుకున్న పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి పురస్కారాలను ప్రకటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *