
సమగ్ర ప్రణాళిక, నిరంతర సాధనతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వివిధ శాఖల ఆధ్వర్యంలోని సంక్షేమ హాస్టళ్లలో చదువుతూ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ‘ వన్ ఆఫీసర్ – వన్ ఇనిస్టిట్యూట్ ‘ పేరుతో ప్రతి జిల్లాస్థాయి అధికారి సంక్షేమ హాస్టళ్లను రెగ్యులరుగా తనిఖీ చేసి వాటిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థులలో విశ్వాసాన్ని పెంపొందించామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా వివిధ శాఖల మండల స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించి ‘ 100 రోజుల ప్రణాళిక ‘ అమలవుతున్న తీరును పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావించి అధికార యంత్రాంగం మొత్తం సమిష్టిగా పనిచేయడంతో ఈసారి టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన స్థానం కోసం ప్రారంభం నుంచి దృష్టి సారిస్తామని చెప్పారు. వెన్ను తట్టి ప్రోత్సహిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించే సత్తా ఉందన్నారు. వారికి ఈ విధంగా టీచర్లు, తల్లిదండ్రులు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. పిల్లలలోని ఆసక్తిని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.





కలెక్టర్ లక్ష సహాయం
టెన్త్ ఫలితాలలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మందికి, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మందికి ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున ఈ కార్యక్రమంలో ప్రోత్సాహక నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంస పత్రం ఇచ్చి సత్కరించారు. దీనికోసం కలెక్టర్ వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు డీఈవో రేణుక తెలిపారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకం, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పర్యవేక్షించటం ద్వారా జిల్లాలో ఈసారి మంచి ఫలితాలు వచ్చాయని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ జయ, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓలు, ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.