తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం

హైదరాబాద్, మే 21,
(జే ఎస్ డి ఎం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యాలయానికి విచ్చేసిన నూతన చైర్‌పర్సన్‌కు మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజరమణ, సిబ్బంది వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాల నడుమ ఘన స్వాగతం పలికారు.తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, తన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు ఆశీర్వాదం తీసుకుని చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ విజయలక్ష్మి తొలి ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌తో పాటు మహిళా కమిషన్ నూతన సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, ఎన్. రాధా భాయ్, ఉజ్మా ఆషాయ్ షాకీర్ కూడా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ అట్టహాస ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ మహమ్మద్ అజహరుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వీరితో పాటు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మహబూబాబాద్ ఎంపీ పి. బలరామ్ నాయక్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత, బీసీ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ హాజరై నూతన చైర్‌పర్సన్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్‌తో పాటు ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నూతన చైర్‌పర్సన్‌ గద్వాల్ విజయలక్ష్మికి, సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో మహిళల సమస్యల పరిష్కారంలో నూతన మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కమిషన్ తన అద్భుతమైన పనితీరుతో రాష్ట్రంలో మహిళల భద్రతను, హక్కులను కాపాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *