రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ప్రకాశం పార్లమెంట్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పనితీరు, ఎన్నికల హామీల అమలు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం దర్శి పట్టణంలోని పిజీన్ కల్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని విమర్శించారు.
ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
సమావేశంలో పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలు తీరుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, చింత శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, డేగ్లస్, మధుసూదన్ రెడ్డి, మధు, సుబ్బయ్య, అంజయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


