మార్కాపురం జిల్లా ఏర్పాటైన అనంతరం తొలిసారిగా జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విజయ సునీత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పనిచేస్తున్న మొత్తం 271 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు అందజేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 271 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామని, ఇంకా మిగిలిన అర్హులైన వారు సంబంధిత పత్రాలు సమర్పిస్తే రెండో విడతలో వారికి కూడా అక్రిడిటేషన్లు అందజేస్తామని వెల్లడించారు.
అలాగే, ఎపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూల అల్లూరి రెడ్డి, జాయింట్ సెక్రటరీ బంకా శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కాపురం జిల్లా అంతర్గత ప్రాంతమైన శ్రీశైలం దేవస్థానం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని విస్తరించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఈ అంశాన్ని పరిశీలించి శ్రీశైలం వరకు పాస్ సౌకర్యం పొడిగించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డిపిఆర్ఓ మోహన్ రాజ్ మాట్లాడుతూ రెండో విడత అక్రిడిటేషన్లకు సంబంధించి త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, ఏపీయూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఉమ్మడి ప్రకాశం జిల్లా కోశాధికారి దారివేముల బాబి, సభ్యులు ఎస్.కె. బషీర్, వి. శ్రీనివాసరెడ్డి, టి. నారాయణరెడ్డి, పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
