‘ పని చేయనప్పుడు మీకు ఉద్యోగం ఎందుకు..? జీతం ఎందుకు..? ప్రభుత్వ కార్యాలయం అంటే సత్రం అనుకుంటున్నారా..? పద్ధతి మార్చుకోండి..! లేదా ఉద్యోగానికి వి.ఆర్.ఎస్. పెట్టి వెళ్లిపోండి ! అంతే తప్ప నిర్లక్ష్యంగా ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు ‘ అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
స్పష్టం చేశారు. గురువారం ఆయన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఉద్యోగి జాబ్ చార్ట్ పై ఆరా తీసి వారు చేస్తున్న పనిని ప్రత్యక్షంగా పరిశీలించారు. విధుల నిర్వహణలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంపై కలెక్టర్ ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి, పనితీరు మార్చుకోకపోతే ఇకనుంచి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదని హెచ్చరించారు. సుమారు గంటన్నర పాటు కార్పొరేషన్ లోని ప్రతి గదినీ తనిఖీ చేసి సంబంధిత ఫైళ్లను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని సిబ్బందిని మార్చాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పని అవసరాలను గుర్తించి సిబ్బందిని రేషనలైజ్ చేయాలన్నారు. పారిశుద్ధ్యం కాకుండా ఇతర విభాగాలలో అవుట్ సోర్స్ ప్రాతిపదికన పనిచస్తున్న సిబ్బంది వివరాలను తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సిబ్బంది తమకు ఫోన్ చేసే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ చెప్పారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారంపైనా తిరిగి వారితో మాట్లాడి ఆరా తీయాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది అందరూ బయోమెట్రిక్ హాజరు వేయాలని, విధుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో కచ్చితంగా సంతకం చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనరుకు చెప్పారు. కార్పొరేషన్ ప్రాంగణంలోనూ, కార్యాలయంలో కూడా
సిసి కెమెరాలు పూర్తిస్థాయిలో పెట్టాలని కలెక్టర్
స్పష్టం చేశారు.
*అందరూ ఫీల్డ్ లో ఉండాలి…*
పారిశుద్ధ్య కార్మికులు అందరూ కచ్చితంగా వేకువజామునే ఫీల్డ్ లో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్యము, త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ‘ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ‘ మరో వారం రోజులు ఉన్నందున నగరం మొత్తం పారిశుద్ధ్య కార్యకలాపాలను ఉదృతం చేయాలన్నారు. నగర ప్రజలు తమ సమస్యలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన 18004252381
టోల్ ఫ్రీ నంబర్ గురించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
*ప్రతివారం వస్తా… పురోగతి ఉండాలి*
నగర పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ‘ మీకోసం ‘ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం కార్పొరేషన్ లోని స్పెషల్ ఆఫీసర్ చాంబర్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారం, ప్రజలకు సేవలు అందించడంలో ప్రతివారం నాణ్యత మరింత మెరుగుపడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
*పోతురాజుపై ప్రత్యేక దృష్టి*
గత ఏడాది మొంథా తుఫాను సమయంలో తలెత్తిన పరిస్థితి పునరావృతం కాకుండా పోతురాజు కాలువపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పూడికతీతతో పాటు కాలువగట్లపై ఆక్రమణలు తొలగిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నగరంలోని ఖాళీ మున్సిపల్ స్థలాలను పి.పి.పి. పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లు, హోటళ్ళు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి కేటాయిస్తామన్నారు. నగరంలోని రోడ్ల వెంట ఫుట్ పాత్ కూడా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఒంగోలు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని చెప్పారు. జిల్లాకు లక్షల కోట్ల రూపాయలలో పెట్టుబడును వస్తున్నందున ఆయా కంపెనీలకు సమీపంలో ఉన్న ఒంగోలు నగరాన్ని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయబోతున్నట్లు వివరించారు. ఈ విషయంలో ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
కలెక్టర్ వెంట కమిషనర్ వెంకట కృష్ణయ్య, డీ.ఈ.ఈ. పద్మజ, ఎంహెచ్ఓ వైష్ణవి, ఇతర అధికారులు ఉన్నారు.



