కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతం….సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట జులై 4,
(జే ఎస్ డి ఎం. న్యూస్) :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతంఅవుతున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం బేగంపేట డివిజన్ పరిధిలోని పీజీ రోడ్డులో గల సిల్వర్ జూబ్లీ సొసైటీ వాసుల సమావేశానికి హాజరైన ఆయన, అనంతరం పార్క్ అవెన్యూ కాలనీ, లాల్ బహదూర్ నగర్ కాలనీలలో పర్యటించి స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయని కాలనీవాసులు ఫిర్యాదు చేయగా, డ్రైనేజీ లైన్లను వెంటనే శుభ్రం చేయాలని, అవసరమైతే పైప్‌లైన్ల మార్పిడికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. అలాగే గుంతలమయంగా మారిన రోడ్ల నిర్మాణానికి సైతం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలైనా రోజుల వ్యవధిలోనే కోట్ల నిధులు ఖర్చు చేసి పరిష్కరించేవాళ్లమని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో లక్ష రూపాయల పని కూడా జరగని దుర్భర పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఎన్నికల ముందు కొండంత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా వాటిని అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి 10 వేల పెట్టుబడి సాయం, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నేడు నగర ప్రజలు కనీసం తాగునీటి కోసం కూడా అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. హామీల అమలు గురించి అడిగితే ముఖ్యమంత్రి బూతులతో కాలక్షేపం చేస్తూ సీఎం పదవి గౌరవాన్ని దిగజారుస్తున్నారని, తాను ఇంతవరకు ఇలాంటి భాష మాట్లాడే ముఖ్యమంత్రిని చూడలేదని ఎద్దేవా చేశారు. కాలనీల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అంతకుముందు సిల్వర్ జూబ్లీ సొసైటీలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని అమీర్‌పేట సర్కిల్ డీసీ సుజాతతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *