ఆల్వాల్, జూలై 11
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పిల్లలకు తల్లి దండ్రులే తొలి ట్రాఫిక్ గురువులనీ,
ఆల్వాల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పోలీసులు వివరించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, డీసీపీ కె. రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు ఆల్వాల్‌లోని శ్రీ నారాయణ విద్యా భవన్లో శనివారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలమని, పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రవర్తననే అనుసరిస్తారని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తిరుమల గిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు మాట్లాడుతూ రోడ్డు క్రమశిక్షణ అనేది ఇంటి నుంచే మొదలవుతుందని, తల్లిదండ్రులు స్వయంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే పిల్లల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ వినియోగం ప్రాణరక్షణకు ఎంతటి రక్షణ కవచమో తల్లిదండ్రులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు పి. బి. రవీంద్రనాథన్, జనరల్ సెక్రటరీ ఎం. పద్మనాభన్, ఎడ్యుకేషనల్ సెక్రటరీ రీనా విజయచంద్రన్, ప్రిన్సిపాల్ కె. వి. రాఘవాచార్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్న తల్లిదండ్రులు, పోలీసుల ఈ అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు.



