బేగంపేట జులై 14 (జేఎస్ డిఎం న్యూస్) :
మహిళలభద్రత,సాధికారత,ఆర్థిక ప్రగతి సాధించే దిశగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సహచరి పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మల్కాజ్గిరి సీపీ సుమతి స్పష్టం చేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో మహిళలను నేరాల నియంత్రణలో సైతం భాగస్వాములుగా చేస్తూ తెలంగాణ పోలీస్ వ్యవస్థలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్లు తెలిపారు.’సహచరి’ కార్యక్రమం అమలులో ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP),మెప్మ సంస్థ ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్టు తెలిపారు. సమాజంలో పోలీసులు అందిస్తున్న సేవ బస్తీ ప్రజలకు తెలియజేస్తూ వారిలో భరోసా నింపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతి కోసం మెప్మా సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషికి మహిళా భద్రతను సైతం జోడిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి నూతన బాధ్యతలు అందిస్తున్నట్లు వెల్లడించారు.మహిళల రక్షణ, సాధికారత, కుటుంబ సంక్షేమం, సామాజిక భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని మెప్మా సంస్థ ప్రతినిధుల భాగస్వామ్యంతో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు.మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలకు పోలీసులు అందించే సహకారంతోపాటు చట్టరీత్యా మహిళలలో అవగాహన పెంపొందిస్తున్నట్లు వెల్లడించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 2,70,000 మంది మహిళలకు 3300 మంది మెప్మా సంస్థ ప్రతినిధులకు పోలీస్ స్టేషన్ తో మ్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అనూహ్యస్పందన రావడం పట్ల సిపి సుమతి హర్షం వ్యక్తం చేశారు.

