సికింద్రాబాద్, జూలై 14 (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) క్షేత్రస్థాయిలో ఉన్న విద్యుత్ సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజాబాట’ కార్యక్రమం నేడు జనరల్ బజార్ సెక్షన్ పరిధిలో విజయవంతంగా కొనసాగింది. ఈ రోజు జనరల్ బజార్ సెక్షన్ పరిధిలోని ఆవుల మంద, స్వామి వివేకానంద కాలనీలో విద్యుత్ అధికారులు పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆవుల మంద ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న పలు విద్యుత్ సమస్యలను స్థానిక స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. దయానందరావు స్థానిక విద్యుత్ శాఖ ఏఈ కాసం రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. కాలనీవాసుల వినతులపై ఏఈ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
ఇదే క్రమంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమన్వయంతో కాలనీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ యార్డు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని అధికారులు పూర్తిగా తొలగించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా, ప్రజల చెంతకే పాలన అందించాలనే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో జనరల్ బజార్ విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది, స్థానిక కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
