బోయిన్‌పల్లి, జూలై 15 (జే ఎస్ డి ఎం న్యూస్) :
రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా చిన్న వయసు నుంచే పిల్లల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు అన్నారు. మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-1) శ్రీ కె. రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు.. ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా బుధవారం బోయిన్‌పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్‌లో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ఇన్వెస్టిచర్ సెరిమనీ (నాయకత్వ ప్రమాణ స్వీకారోత్సవం) సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏసీపీ శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రవర్తనను చూసే అనేక విషయాలు నేర్చుకుంటారని, అందుకే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని, సిగ్నల్స్ జంప్ చేయవద్దని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు మాట్లాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు. అదేవిధంగా మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులంతా తమ ఇళ్లలో ‘ట్రాఫిక్ సేఫ్టీ అంబాసిడర్లుగా’ మారి, కుటుంబ సభ్యులు నియమాలు పాటించేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు.
రహదారి దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్‌లను మాత్రమే ఉపయోగించాలని, నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులు పాఠశాలలోనే కాకుండా సమాజంలోనూ రహదారి భద్రతపై అవగాహన కల్పించడంలో ముందుండాలని ఏసీపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ గండ్రాల్, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

