ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో సంభవించే నీటి కొరతను అధిగమించడానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఎలినో ప్రభావంపై సమీక్ష జరిపి, అధికారులకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలినో ప్రభావం అనేది కేవలం ఏదో ఒక శాఖకు పరిమితమైన అంశం కాదని, ప్రతి శాఖ అధికారీ దీనిని తమ ప్రాథమిక బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
నీటి నిర్వహణలో నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రకాల వాటర్ ట్యాంకులు, నీటి నిల్వ వనరులు మరియు సరఫరా పైప్లైన్ లీకేజీలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఒక చుక్క నీరు కూడా వృథా కాకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు సంయుక్తంగా వ్యవహరిస్తూ రైతాంగానికి సరైన దిశానిర్దేశం చేయాలన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలన్నారు. అంతేకాకుండా మార్కెట్లో మంచి ధర లభించే పంటల ఎంపికపై వారికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలో ఉన్న 44 బయో రీసోర్స్ సెంటర్లను (Bio Resource Centres) సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ప్రకృతి వ్యవసాయం (Natural Farming) పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు రాబోయే మూడు నెలల పాటు విబిజీ రాంజీ
పథకం ద్వారా నిరంతరం పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (SOP) సిద్ధం చేశామని, సవరణల అనంతరం దీనిని త్వరలోనే అన్ని శాఖలకు సర్క్యులేట్ చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇదే సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ అత్యవసరమని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ఎలినో వల్ల భూగర్భ జలాలు క్షీణించి తాగునీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉన్నందున గ్రామ సభలు, రైతు సదస్సులు నిర్వహించి ప్రజలను, రైతులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కుళాయిలను అనవసరంగా తెరిచి ఉంచకుండా అవసరమైన మేరకు మాత్రమే నీటిని ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. తాగునీటిని వాహనాలు కడగడానికి, రోడ్లు మరియు ఇళ్ల ముందు చల్లడానికి వృథా చేయకూడదని, గృహ అవసరాలకు వాడిన నీటిని చెట్లకు, తోటలకు మళ్లించేలా చూడాలన్నారు. వర్షపు నీటిని భవిష్యత్తు అవసరాల కోసం సంరక్షించేందుకు రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానాలను ప్రోత్సహించాలని, పాత బావులు, చేతి బావులను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు చెరువులు, కుంటలను శుభ్రం చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు.
అక్రమ నీటి కనెక్షన్లు చట్టరీత్యా నేరమని, నీటి లీకేజీలు కనిపిస్తే వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించేలా గ్రామాల్లో మైక్ అనౌన్స్మెంట్లు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు, యువకులు, గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా నీటి పొదుపును ఒక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. అందరి సహకారంతోనే మన గ్రామాన్ని, మన నీటి వనరులను కాపాడుకోగలమని, నేడు ఆదా చేసే ప్రతీ నీటి బొట్టు రేపటి మన తాగునీటి భద్రతకు పునాది అని తెలుపుతూ నీటిని ఆదా చేస్తూ భవిష్యత్తును కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


