జర్నలిజాన్ని , జర్నలిస్టులనురక్షించాల్సిందే -ఐ.జే.యు. సెమినార్ లో వక్తలు

బెంగుళూరు ఆగస్ట్ 8: భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాల్సిందేనని పలువురు వక్తలు ఉద్ఘాటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దేశంలో పాలకవర్గాల నియంతృత్వ పోకడలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిజాన్ని, జర్నలిస్టులను రక్షించాల్సిన అవసరం ఉందని వారన్నారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు), కర్ణాటక స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్‌ (కేఎస్ జేయు) సంయుక్త ఆధ్వర్యంలో “జర్నలిజం మరియు వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ అవసరమా?” అంశంపై శనివారం నాడు బెంగళూరులోని బెంగుళూరు గేట్ హోటల్ లోని సెమినార్ హాలులో సదస్సు జరిగింది.

ఐజేయూ అధ్యక్షులు బల్విందర్ సింగ్ సింగ్ జమ్మూ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్ కీలక ఉపన్యాసం చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి, కర్ణాటక ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆయేషా ఖనూం తదితరులు హాజరయ్యారు.
సదస్సులో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, 2020లో రద్దయిన రెండు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలతో సహా మొత్తం 13 చట్టాల రద్దు గురించి ప్రస్తావించారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రత్యేక కారణాన్ని , వివరణను పార్లమెంటుకు ఇవ్వలేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు.
ఈరద్దు నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయడానికి చట్టంలో ఏదైనా అవకాశం ఉందా అని కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. మీడియా కేవలం వార్తలను ప్రసారం చేసేవారిగా కాకుండా, నిష్పాక్షికంగా వ్యవహరించే రిఫరీ పాత్రను పోషించాలని ఆయన సూచించారు. ప్రస్తుత జర్నలిజం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆధునిక, డిజిటల్ మీడియాలో పనిచేసేవారు తాము నివేదించే అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని, వాస్తవాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. దీనివల్ల మీడియా విశ్వసనీయత గణనీయంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఖచ్చితంగా, జర్నలిస్టులకు రక్షణ అవసరం,” అని ఆయన స్పష్టం చేశారు.
రద్దు చేయబడిన చట్టాల గురించి వివరంగా మాట్లాడుతూ, ప్రభుత్వం ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుందని, దీనిపై ఎటువంటి సంప్రదింపుల ప్రక్రియ జరపలేదని, ఇంతటి కీలక నిర్ణయం తీసుకునే ముందు సంప్రదింపుల కోసం జర్నలిస్టులను ఆహ్వానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ఇతర వృత్తులలో పనిచేసే వ్యక్తులతో పోల్చలేమని ఆయన వివరించారు.

బెంగళూరులో ఆగస్టు 8, 9 తేదీలలో జరుగుతున్న ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా తొలిరోజు ఉదయం ఈ సదస్సును నిర్వహించారు.

‘ది వైర్’ వ్యవస్థాపకుడు, సంపాదకుడు, సీనియర్ పాత్రికేయులు సిద్ధార్థ్ వరదరాజన్ కీలకోపన్యాసం చేస్తూ, భారతదేశంలో జర్నలిజానికి జర్నలిస్టులకు రక్షణ తప్పనిసరిగా అవసరమని నొక్కి చెప్పారు.

వార్ ఫేర్ (యుద్ధం) తరహాలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు వ్యతిరేకంగా లా ఫేర్ తో దాడులకు పాల్పడుతుందని విమర్శించారు.

వివాద సందర్భాల్లో గతంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న ప్రధాన ముప్పులలో పరువు నష్టం దావా ఒకటిగా ఉండేదని, కానీ ప్రస్తుతం కాలం మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులు దేశద్రోహం, ఉపా తదితర తీవ్రమైన నేర అభియోగాల రూపంలో పరువు నష్టం కంటే కఠినమైన చట్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రజల భద్రతకు ముప్పు చట్టాన్ని ఉపయోగించి పాత్రికేయులను అణచివేస్తున్నారని, వారిపై తీవ్రమైన నేరారోపణలు మోపుతున్నారని వరదరాజన్ అన్నారు. గణతంత్ర భారతదేశంలో ప్రాథమిక హక్కులు కాలరాస్తున్న తొలి ప్రధానిగా మోడీ చరిత్రకు ఎక్కారన్నారు. జమ్మూ కాశ్మీర్ కి పరిమితమైన ఉపా చట్టాన్ని దేశవ్యాప్తం చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. చట్టాలను, దర్యాప్తు సంస్థలను వర్తమానంలో దుర్వినియోగం చేస్తున్నంతగా గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. మీడియాపై తమ ఒత్తిడిని ప్రభావాన్ని చూపడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలను, ప్రజా సంబంధాల బడ్జెట్‌లను పరికరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయని, ఇది నిష్పక్షపాత జర్నలిజానికి అతిపెద్ద సవాళ్లలో ఒకటని ఆయన అభివర్ణించారు.
2024 ఎన్నికల సమయంలో ప్రభుత్వం డిజిటల్ మీడియాను నియంత్రించలేకపోయిందని, అయితే ఎన్నికల తర్వాత ఐటీ చట్టం అమలుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తదుపరి డిజిటల్ సేవల ప్రసార చట్టం ముసాయిదాను తీసుకురాబోతోందని తెలిపారు. ప్రమాదకరమైన ఐటీ రూల్స్ వెబ్ జర్నలిజం స్వేచ్ఛను హరించబోతున్నాయని అన్నారు. జర్నలిజంలో నైతిక ప్రమాణాల కోసం ఎంతగానో కృషిచేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నేడు నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ ఫాక్ట్ చెకింగ్ యూనిట్ వార్తల నిజనిర్ధారణను తేల్చాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నదని దుయ్యబట్టారు. ఢిల్లీలో మెజార్టీ జర్నలిస్టులకు పిఐబి కార్డులు లేవని, రాజధానిలో జర్నలిస్టుల దారుణ పని పరిస్థితులకు ఇది అద్దం పడుతుందని అన్నారు. జర్నలిస్టులకు, జర్నలిజానికి రక్షణ కల్పిస్తే, ప్రజలకు రక్షణ ఉంటుందని అన్నారు. ఏ ఒక్క ఛానల్ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే, జాతీయ భద్రత సాకుతో బ్రాడ్కాస్టింగ్ లైసెన్సులను రద్దు చేసి, చానల్స్ ను మూసేస్తున్నారని సిద్ధార్థ వరదరాజన్ అన్నారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమ అనంతరం నాయకులు జర్నలిస్టుల హక్కుల కోసం, వారి పని పరిస్థితులు మెరుగుపరచడంపై దృష్టి సారించారని, నేటి నాయకులు మీడియా హక్కుల హననంపై ఆసక్తి చూపుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాల తో పాటు 13 చట్టాలను రద్దుచేసి ఏర్పాటు చేసిన 4 కార్మిక స్మృతులకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆరు జాతీయ సమ్మెలకు ఐ.జే.యు.మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలరద్దుకు వ్యతిరేకంగా పార్లమెంటరీ కమిటీకి వినతి పత్రం ఇచ్చామని గుర్తు చేశారు. నాలుగు కోడ్స్ నోటిఫికేషన్ను అమలు చేయకుండా నిలిపేసిన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల స్ఫూర్తిని అభినందించారు. ఈ సెమినార్ ఐ జె యు భవిష్యత్ కార్యాచరణకు దిశా నిర్దేశం చేస్తున్నదని శ్రీనివాసరెడ్డి అన్నారు.

కర్ణాటక మీడియా అకాడమీ చైర్‌పర్సన్ అయేషా ఖానం మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ ఒకే వేదికపై ఏకం కావాలని అన్నారు. “మనం విడిపోయి ఉండటం వల్ల విశ్వసనీయత తగ్గుతుంది,” అని ఆమె పేర్కొన్నారు.
జర్నలిస్టుల రక్షణ బిల్లు ముసాయిదా తయారీ గురించి చాలా మంది జర్నలిస్టులకు అవగాహన లేదని ఆమె చెప్పారు. అందువల్ల, ఇటువంటి వేదికల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం, ప్రచారం చేయడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.

ఐజేయు సెక్రటరీ జనరల్ డి. సోమ సుందర్ అతిథులకు, సభికులకు స్వాగతం పలికారు. ఐజేయు మాజీ అధ్యక్షులు ఎస్. ఎన్. సిన్హా, అమర్ దేవులపల్లి, సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ రజాక్ కూడా ఈ సదస్సులో ప్రసంగించారు.

ఐజేయు జాతీయ కార్యవర్గ సమావేశ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ముఖ్య వక్త సిద్ధార్థ్ వరదరాజన్, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు.
కాగా, కర్ణాటక స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ సదస్సుకు హాజరైన ప్రముఖులను సత్కరించింది. కర్ణాటక రాష్ట్ర జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షురాలు జానకి మోహన్ వందన సమర్పణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *