ఎల్ నినో నేపథ్యంలో ఈ ఏడాది నీటి వనరుల సంరక్షణపై మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ‘ జలధార – జల హారతి ‘ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులపై శనివారం అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సేక్రటరీ శశిభూషణ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నందున ‘ జలధార – జల హారతి ‘ పనులను కొనసాగించాలని, వి.బి.జి.రాంజీ పథకం కింద కూడా ఈ పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని కాపాడుకోవాలని ఆయన చెప్పారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నీటిని పొదుపుగా సమర్థంగా వినియోగించుకోవాలని, పశుగ్రాసానికి కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా దృష్టి సారించాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పీడీ జోసఫ్ కుమార్, భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఈ.ఈ. శివరాం ప్రసాద్ పాల్గొన్నారు.


