హుస్సేన్ సాగర్‌లో పడ్డ విదేశీ విద్యార్థిని కాపాడిన లేక్ పోలీసులు.

హైదరాబాద్ ఆగస్ట్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్ సరస్సులో పడిపోయిన ఓ విదేశీ విద్యార్థిని సైఫాబాద్ పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 4:20 గంటల ప్రాంతంలో సైఫాబాద్ పెట్రోల్ కార్-1 సిబ్బంది ఎన్టీఆర్ మార్గ్‌లో గస్తీ నిర్వహిస్తుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న గ్రిల్స్ వద్ద నిలబడిన ఓ యువకుడు అకస్మాత్తుగా జారి నీటిలో పడిపోయాడు. దీన్ని వెంటనే గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాడు సహాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీసి, లేక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
లేక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి. శ్రీనివాసరావు వివరాలు సేకరించగా, బాధితుడు సూడాన్ దేశానికి చెందిన 25 ఏళ్ల నజర్ ఆడం బదావి మహాదిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు రాజస్థాన్‌లోని అజ్మీర్ భగవంత్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. సూడాన్ నుంచి వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వచ్చి టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో ఉంటున్న తన సోదరుడి స్నేహితుడిని కలిసేందుకు కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చాడు.
మొబైల్ ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో దానిని గదిలోనే ఉంచి నగర సందర్శనకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడైంది. పోలీసులు అతని పాస్‌పోర్ట్, వీసా వివరాలను పరిశీలించి అవి సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించుకున్నారు. అనంతరం అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, టోలిచౌకిలోని అతని కుటుంబ సభ్యులు, బంధువులకు సురక్షితంగా అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పెట్రోల్ కార్-1 సిబ్బందితో పాటు లేక్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *