\డప్పు కళాకారులు, చర్మకారులకు మంజూరు చేసే పింఛన్లకు సంబంధించి దరఖాస్తుదారులు నేరుగా సాంఘిక సంక్షేమ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ పింఛన్లకు అర్హత కలిగిన వారు స్వీయ ధ్రువీకరణ (Self Declaration) పత్రంతో తమ దరఖాస్తులను గ్రామాల్లో సంబంధిత ‘స్వర్ణ గ్రామం’ (సచివాలయం) ద్వారా, పట్టణ ప్రాంతాల్లో ‘స్వర్ణ వార్డు’ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ నమోదు చేసి, పింఛన్ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పిస్తారని తెలిపారు. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తులు తదుపరి సంబంధిత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (గ్రామీణ ప్రాంతాలు) లేదా వార్డు వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (పట్టణ ప్రాంతాలు) పరిశీలనకు వెళ్తాయని, అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలిస్తారని డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు.
అర్హతను నిర్ధారించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి పరిశీలన (Field Verification) నిర్వహించిన అనంతరం, అర్హులైన దరఖాస్తులను తదుపరి ప్రక్రియ నిమిత్తం సంబంధిత ఎంపీడీవో (MPDO) లేదా మున్సిపల్ కమిషనర్‌కు పంపించడం జరుగుతుందని వివరించారు.
కాబట్టి, డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్ల కోసం సాంఘిక సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, తమకు సమీపంలోని స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సచివాలయాన్ని సంప్రదించి, స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకోవాలని ఎన్. లక్ష్మా నాయక్ కోరారు.
పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, పరిశీలన, క్షేత్రస్థాయి ధ్రువీకరణ తదితర ప్రక్రియలన్నీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు తలెత్తితే, గ్రామీణ ప్రాంతాల్లోని స్వర్ణ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ను, లేదా పట్టణ ప్రాంతాల్లోని స్వర్ణ వార్డు సచివాలయ వార్డు వెల్ఫేర్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని సంప్రదించాలని ఆయన సూచించారు.
డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల దరఖాస్తులకు సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు – ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్
10
Sep