స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలు తమ వంతు బాధ్యత నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాల ప్రదానోత్సవంలో కలెక్టర్ పి.రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్షే క్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ముప్పవరపు సుచిత్రలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 17 కేటగిరీలలో 65 మందికి పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వచ్ఛత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యర్థాలను సేకరించి సరుకులు ఇచ్చేందుకు ప్రతి గ్రామానికీ స్వచ్ఛరథం వస్తుందన్నారు. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం పైనా ప్రభుత్వం దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఒంగోలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెత్తను సంపదగా మార్చేందుకు ‘ గ్రీన్ గోల్డ్ ‘ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. అందుకే విద్యార్థుల కోసం హాస్టళ్లలో ‘ ముస్తాబు ‘ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే మనకు గౌరవం లభిస్తుందన్నారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం, పరిశుభ్ర సమాజం కోసం కలలు కన్నారని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కల సాకారం అవుతుందన్నారు. గత నెలలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. అదే విధానాన్ని ప్రజలు కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛతను తమ జీవన విధానంగా మార్చుకోవాలని అన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆరోగ్యకర సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. అందుకోసమే ప్రతినెలా మూడవ శనివారం ‘ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ‘ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రియాజ్, సుచిత్ర మాట్లాడుతూ స్వచ్ఛత ప్రాధాన్యాన్ని వివరించారు. అవార్డు విజేతలకు వారు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి. వెంకటరమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ, మెప్మా పీడీ నారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, మాజీ మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, మున్సిపల్ ఇంజనీర్ యెషయా, ఎంహెచ్ఓ వైష్ణవి, అధికారులు పాల్గొన్నారు.
మై కలెక్టర్ యాప్ ఆవిష్కరణ
జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా రూపొందించిన ' మై కలెక్టర్ ప్రకాశం ' మొబైల్ అప్లికేషన్ ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. దీని గురించి కలెక్టర్ వివరిస్తూ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చు అన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా పి-4 కార్యక్రమానికి ఆర్థిక సహాయం కూడా చేయవచ్చన్నారు. ఈ విధంగా విరాళం ఇచ్చే డబ్బులు నేరుగా కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి అన్నారు. మెరుగైన సమాజ ఆవిష్కరణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.







Save or share this story as a newspaper-style Epaper Clip: